– గ్రామాల్లో నీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర సమీక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : రాష్ట్రంలో కరువు, ఎల్నినో పరిస్థితులను సమీక్షించి వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఆర్టీ నం.1523ను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మంత్రి సీతక్క అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో తాగునీటి సరఫరా, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తాగునీటి భద్రతతోపాటు జల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలకంగా వ్యవహరిస్తోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు, పంట గుంతలు, ఊట కుంటల నిర్మాణం, నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తోంది. నీటి వనరులను సంరక్షించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భవిష్యత్తులో తాగునీటి కొరతను తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే నీటి సమస్యలను గుర్తించి పరిష్కరించడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చూడటంలో శాఖ సమన్వయంతో పనిచేస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా ఉన్న ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు తదుపరి చర్యలపై ప్రభుత్వానికి సిఫారసులు చేయడం ఈ కమిటీ బాధ్యత.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




