– జిల్లా, మండలస్థాయిలోనూ రూపొందించాలి
– ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ఐఏఎస్‌లతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ఎల్-నినో ప్రభావంతో తాగునీరు, విద్యుత్ కొరత రాకుండా జిల్లా, మండల స్థాయిలోనూ ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ఎల్-నినో నేపథ్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడనున్న తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రస్థాయిలో వివిధ శాఖల వారీగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించి ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. ఇదేవిధంగా సూక్ష్మ స్థాయిలోనూ తగు ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా లేనప్పటికీ వ్యవసాయానికి, గృహోపయోగ అవసరాలకు అందిస్తున్నామని, పరిశ్రమలకు ఏవిధమైన పవర్ కట్ విధించడం లేదని చెప్పారు. విద్యుత్ సరఫరాపై పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. పగటిపూట అత్యవసర పరిస్థితుల్లో మాత్రం 25 డిగ్రీల పరిమితిలో ఏసీలను వాడాలని, సాయంత్రం ఆరు గంటల తర్వాత వాడకం పూర్తిగా తగ్గించాలని సూచించారు. అన్ని థర్మల్ స్టేషన్లలో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, యాదాద్రి థర్మల్ కేంద్రంలో గరిష్ట స్థాయిలో విధ్యుత్ ఉత్పత్తికి ఈ కేంద్రానికి ప్రత్యేకంగా కేటాయించిన ఐదుగురు స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎల్-నినో ప్రభావాన్ని తెలియచేసేందుకు త్వరలో అఖిలపక్ష సమావేశం జరుగుతుందని, అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కూడా ఉంటుందని సీఎస్ తెలిపారు. వ్యవసాయ అవసరాలకు స్థానికంగా ఉండే నీటి వనరులనుండి అక్రమంగా మోటార్ల ద్వారా నీటిని తోడుతున్నారని, దీని వల్ల అధిక లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. మంజీరా, సింగూరు ద్వారా నీటి సరఫరా లేనందున ఈ జలాశయాలనుండి వచ్చే 110 ఎంజీడీల నీటిని, ప్రత్యామ్నాయ మార్గాలైన మిషన్ భగీరథ నుండి 60 ఎంజీడీలను, కృష్ణా, ఇతర మార్గాల ద్వారా నీటిని తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి అవసరాలకు మాత్రమే నిబంధనలను అనుసరించి బోరు బావుల తవ్వకానికి అనుమతించాలని, నిర్మాణ, ఇతర పనులకు మాత్రం కొత్తగా బోరు బావుల తవ్వకానికి అనుమతించవద్దని, తాగునీటి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బోరు బావులను మరింత లోతుగా తవ్వడానికి అనుమతిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. నగరంలో నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి పెద్ద ఎత్తున నీటిని తోడే విధానంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, హైడ్రా తదితర ఏజెన్సీలతో కలసి అక్రమ నీటి మోటార్లను ఏరివేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ 1 నుండి హైదరాబాద్ నగరంలో నిర్మాణ పనులకు ఎస్టీపీల ద్వారా వచ్చే ట్రీట్మెంట్ వాటర్‌ను గ్రీన్ ట్యాంకర్ల ద్వారా అందచేయనున్నట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జల మట్టం గణనీయంగా పడిపోతున్నందున తాగునీటికి ఏవిధమైన సమస్య లేకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు. నల్గొండ జిల్లాలో ఉపాధి హామీ పనులను మరింత ముమ్మరంగా చేస్తున్నామని ప్రత్యేక కార్యదర్శి హరిచందన తెలిపారు. కరీంనగర్ జిల్లాలో వచ్చే జూన్ వరకు తాగు నీటి సమస్య లేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.డి.ఎక్కా చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని కార్యదర్శి ఇలంబర్తి చెప్పారు. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు జూన్ వరకు తాగు నీరు అందించాలంటే పాలేరు రిజర్వాయర్‌లో నాలుగు టీఎంసీల జలాలు కావాలని, ప్రస్తుతం ఇందులో రెండు టీఎంసీలే ఉన్నాయని ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె.శ్రీదేవి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండి జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





