ప్రొఫెసర్ సమ్మయ్యకు బెస్ట్ సైంటిస్ట్ అవార్డు

– కేయూ ఫార్మసీ కళాశాలకు అరుదైన గౌరవం
– హర్షం వ్యక్తం చేసిన ప్రొఫెసర్లు, ప్రముఖులు

హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ రంగంలో విశేష సేవలకుగాను కాకతీయ యూనివర్సిటీ (కేయూ) ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ సమ్మయ్యకు సైంటిఫిక్ లారెల్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకమైన బెస్ట్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేసింది. ఔషధ శాస్త్ర పరిశోధన, ఉన్నత విద్య, పరిశోధకుల మార్గదర్శకత్వం, విద్యా పరిపాలన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

కేయూలో కీలక పదవులు

ప్రొఫెసర్ సమ్మయ్య కేయూలో డిగ్రీ, బనారస్ యూనివర్సిటీలో ఎంఫార్మసీ పూర్తి చేశారు. ఫార్మాస్యూటికల్స్‌లో మాన్యుఫాక్చరింగ్ కెమిస్ట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అధ్యాపక వృత్తిలోకి ప్రవేశించారు. 2003 మార్చిలో కాకతీయ విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో కాంట్రాక్టు లెక్చరర్‌గా చేరి తన ప్రతిభ, అంకితభావం, పరిశోధనా నైపుణ్యంతో వివిధ అకడమిక్ కీలక పదవులను నిర్వర్తించారు. జనవరి 2024 నుంచి జనవరి 2026 వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించి విద్యా పరిపాలన, పాఠ్యాంశాల అభివృద్ధి, పరిశోధనల ప్రోత్సాహం, సంస్థాగత అభివృద్ధికి విశేష కృషి చేశారు.

పరిశోధనా రంగంలో మైలురాళ్లు

తన సుదీర్ఘ విద్యా, పరిశోధనా ప్రస్థానంలో ప్రొఫెసర్ సమ్మయ్య మొత్తం 77 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఆయన పరిశోధనా ప్రొఫైల్‌లో 6 హెచ్-ఇండెక్స్, 99 సైటేషన్లు నమోదయ్యాయి. అంతేకాక నాలుగు పరిశోధనా ప్రాజెక్టులను నిర్వహించి ఔషధ శాస్త్ర రంగంలో పరిశోధనాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. పరిశోధకుల తయారీలోనూ ఆయన విశేష సేవలందించారు. 2007 నుంచి 2025 వరకు మొత్తం 105 ఎం.ఫార్మసీ విద్యార్థుల పరిశోధనా ప్రాజెక్టులకు మార్గదర్శకత్వం వహించారు. 2007 నుంచి 2026 వరకు ఎనిమిదిమంది ఆయన మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీ పూర్తి చేయగా, మరో ఐదుగురు ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేస్తున్నారు. యువ పరిశోధకుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, పరిశోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, నాణ్యమైన ఔషధ పరిశోధనలను ప్రోత్సహించడం వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

విద్యా పరిపాలన రంగంలోనూ విశేష అనుభవం

విద్యా పరిపాలన రంగంలోనూ ప్రొఫెసర్ సమ్మయ్య విశేష అనుభవాన్ని కలిగి ఉన్నారు. కేయూలో ఎ న్‌ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్‌గా, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ హెడ్‌గా, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. డీన్‌గా విద్యా ప్రణాళికల రూపకల్పన, పాఠ్యాంశాల అభివృద్ధి, పరిశోధనలకు ప్రోత్సాహం, విద్యాసంస్థ అభివృద్ధికి కృషి చేశారు. ఫార్మసీ రంగంలో వృత్తిపరమైన క్లినికల్ ఫార్మసిస్ట్ అనుభవంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధన, బోధన, విద్యా పరిపాలనలో ఉన్నతస్థాయికి చేరుకోవడం విశేషం. పరిశోధనా ప్రచురణలు, నిధులతో కూడిన ప్రాజెక్టుల నిర్వహణ, పీజీ పీహెచ్‌డీ పరిశోధకులకు మార్గదర్శకత్వం, విద్యా సంస్థ అభివృద్ధిలో ఆయన చేసిన కృషి ఔషధ శాస్త్ర రంగానికి విలువైన సేవగా నిలుస్తోంది. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ రంగంలో పరిశోధనా ప్రతిభను ప్రోత్సహించడం, శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తరించడం, భవిష్యత్ పరిశోధకులను తీర్చిదిద్దడం, ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాల్లో ప్రొఫెసర్ సమ్మయ్య అందించిన సేవలకు ఈ సైంటిఫిక్ లారెల్స్ బెస్ట్ సైంటిస్ట్ అవార్డు తగిన గుర్తింపుగా నిలుస్తోంది. ఆయనకు ఈ అవార్డు లభించడం కేయÖ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *