– ఆరు లక్షల మంది సందర్శకులు
– రికార్డు స్థాయిలో రూ.9.29 కోట్ల అమ్మకాలు
– మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు భారీ ఆదరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పించి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తున్న సారస్ మేలా ఈ ఏడాది ఘన విజయాన్ని సాధించింది. ఈనెల 7 నుంచి 18 వరకు హైదరాబాద్లో నిర్వహించిన మేలాలో రికార్డు స్థాయిలో రూ.9.29 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తం 5,98,029 మంది సందర్శించి మహిళా సంఘాల ఉత్పత్తులను కొనుగోలు చేశారు. హెచ్ఎండీఏ గ్రౌండ్లో 225 స్టాళ్లతో నిర్వహించిన ఈ మేలా మహిళా వ్యాపారులకు మంచి మార్కెట్ వేదికగా నిలిచింది. చివరి నాలుగు రోజుల్లో ప్రతిరోజూ రూ.కోటికి పైగా అమ్మకాలు జరగడం విశేషం.
మూడేళ్లలోû అత్యధిక అమ్మకాలు
మేలాలో గత మూడేళ్ల అమ్మకాల గణాంకాలు ప్రజా ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళా సంఘాల ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణను చాటుతున్నాయి. 2024లో రూ.7.81 కోట్ల అమ్మకాలు జరగగా 2025లో రూ.3.28 కోట్ల వ్యాపారం నమోదైంది. ఈ ఏడాది ఏకంగా రూ.9.29 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2025తో పోలిస్తే ఈసారి అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2025లో 1,69,015 మంది మేలాను సందర్శించగా ఈసారి 5,98,029మంది సందర్శించారు. మహిళలు తయారు చేసిన ఆహార పదార్థాలు, చేనేత వస్త్రాలు, హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తులకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభించింది. అమ్మకాలు ఆశించిన స్థాయిని మించడంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
మహిళా సాధికారతకు సారస్ మేలా బాటలు
గ్రామీణ మహిళల సంప్రదాయ నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఈ మేలా కీలక పాత్ర పోషిస్తోంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా మహిళలను కేవలం ఉత్పత్తిదారులుగానే కాకుండా సొంత వ్యాపారాలను నిర్వహించే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి వేదికలు దోహదపడుతున్నాయి.
మహిళలకు మెరుగైన సౌకర్యాలు
మేలాలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామీణాభివృద్ధి శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. వారి వసతి, భోజనం, రవాణా ఖర్చులను శాఖే భరించింది. సందర్శకుల సౌకర్యార్థం సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేయడంతోపాటు, పార్కింగ్, భద్రత, ఇతర మౌలిక వసతులను కల్పించారు. మెరుగైన నిర్వహణ, సౌకర్యవంతమైన వాతావరణం కారణంగా సందర్శకుల రాక పెరిగి అమ్మకాలు కూడా గణనీయంగా వృద్ధి చెందాయి.
రికార్డు అమ్మకాలపై మంత్రి సీతక్క హర్షం
మేలా విజయవంతం కావడం, మహిళా సంఘాల ఉత్పత్తులకు పెద్దఎత్తున ఆదరణ లభించడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించి వారి కష్టానికి తగిన ఆదాయం సమకూరడం సంతోషకరమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ స్వావలంబన సాధించాలన్నదే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సారస్ మేలాను విజయవంతం చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, సెర్ప్ సిబ్బందిని మంత్రి అభినందించారు. మహిళల ఉత్పత్తులకు మరింత విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ వారి ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం నిరంతరం ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





