– ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలి
– టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
– ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలను నిరసిస్తూ మౌన దీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ‘సర్’ ప్రక్రియను నిలిపివేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ వోటు హక్కు కల్పించాలని ఎమ్మెల్సీ, టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ జయంతి సందర్భంగా టీజేఎస్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మౌన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ కంచే చేను మేసినట్టుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు వ్యవహరించే పరిస్థితి ఉండటం ప్రజాస్వా మ్యానికి ప్రమాదకరమన్నారు. ఎన్నికల కమిషన్ సమావేశాలు సక్రమంగా జరగకపోవడం, ‘సర్’ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. సర్ను నిలిపివేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వోటు హక్కు ద్వారానే ప్రజలు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని, ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్య హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. పౌరుల హక్కులను కాపాడేందుకు పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని కోదండరాం తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయాలను ప్రస్తావించారు. సర్’ ప్రక్రియలో కొత్త వోటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6లో అదనపు అంశాలను చేర్చడం అనేక ప్రశ్నలకు దారితీసిందన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందే యువతకు అనవసరమైన అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. మహిళలు, యువత, అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందన్నారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంస్థ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పనిచేయాలని, వ్యక్తుల ఇష్టాయిష్టాలకు లేదా అదృశ్య శక్తుల ప్రభావానికి లోబడి పనిచేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించ డంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో సాంకేతిక వ్యవస్థల వినియోగం, వాటి నిర్వహణలో పూర్తి పార దర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పక్షాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు కూడా ఈ దీక్షను ఆదర్శంగా తీసుకుని ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గాంధీ ఘాట్ వద్ద దీక్షలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. యువత, ఆదివాసీలు, దళితులు సహా అర్హులైన ప్రజల ఓట్లను తొలగించే విధంగా సర్ ప్రక్రియ కొనసాగకూడదని దయాకర్ అన్నారు. రాజ్యాంగం ద్వారా డాక్టర్ అంబేద్కర్ సామాన్య ప్రజలకు ఓటు హక్కును కల్పించారని, ఆ హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కోదండరాం చేపట్టిన ఈ మౌన దీక్ష ప్రజలందరి మౌన దీక్షఅని పేర్కొన్నారు. ఓటు హక్కు తొలగిస్తే ప్రజల హక్కులను కాపాడే అవకాశం ఉండదని, ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





