రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండదు

– 19వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు
– కరవు పరిస్థితులపై ప్రతిపక్షాలు ఆనందం
– ఆర్ అండ్ బీ శాఖ‌ మంత్రి కోమటిరెడ్డి 

హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ప్రజలకు నిరంతరాయంగా సరఫరా అందిం చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆర్ అండ్ బీ శాఖ‌ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు. కరెంట్ కష్టాలు తలెత్తకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం నల్గొండలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇతర రాష్ట్రాల నుంచి 19,000 మెగావాట్లకు పైగా విద్యుత్  కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుమారు ఐదు గంటల పాటు విద్యుత్, కరవు పరిస్థితులపైనే కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. గతంలో తాను సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్‌ లను తనిఖీ చేసినప్పుడు కొందరు ఆపరేటర్లు విద్యుత్ సరఫరాలో జరుగుతున్న వ్యత్యాసాలను అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సింగరేణి బొగ్గు లింకేజీ, నైనీ బ్లాక్ సమస్యలను సత్వరమే పరిష్కరించి బొగ్గు సరఫరాను పునరుద్ధరించేలా ప్రత్యేక దృష్టి సారించమన్నారు. నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి ద్వారా నియోజకవర్గానికి ఐదువేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొనడంపై ప్రతిపక్షాలు రాజకీయానందం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *