– ఎస్‌హెచ్‌జీ ఆధ్వర్యంలో ఇప్ప పువ్వు టీ స్టాల్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
– ఈ టీకి బ్రాండ్ అంబాసిడర్ సీతక్కే
ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 6: అల్లం చాయ్, మసాలా చాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ.. ఇలా ఎన్నో రకాల చాయ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండగా ఇప్పుడు వాటి సరసన ఇప్ప పువ్వు చాయ్ కూడా చేరింది. ఇప్పటికే ఇప్ప పువ్వుతో తయారు చేస్తున్న లడ్డూలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో ఇప్ప పువ్వు టీకి కూడా విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రి సీతక్క స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం వద్ద మహిళా స్వయం సహాయక సంఘాలచే ఇప్ప పువ్వు టీ స్టాల్‌ను మంత్రి ఏర్పాటు చేయించి ప్రారంభించారు. అడవుల్లో సహజంగా లభించే ఇప్ప పువ్వు ఆదివాసీ గిరిజనుల జీవన విధానంలో భాగమని, తరతరాలుగా వారు ఇప్ప పువ్వును వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించడానికే పరిమితం కాకుండా వాటికి అదనపు విలువ జోడించి మార్కెట్లో విక్రయించగలిగితే మహిళలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులతో వినూత్న ఉత్పత్తులను తయారు చేసి వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఇప్ప పువ్వు టీకి ప్రజల్లో ఆదరణ పెరిగేలా తానే ప్రచారం చేస్తానని, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ములుగు ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు ఇప్ప పువ్వు టీని ప్రత్యేక ఆకర్షణగా పరిచయం చేయడంతో పాటు ఈ ఉత్పత్తిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అటవీ సంపదకు విలువను జోడించి ఆదివాసీ గిరిజన మహిళల చేతుల్లో ఆర్థిక సంపదగా మార్చడమే లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





