నిశ్శబ్ద ద్రవ్యోల్బణ దాడి… అలవాటుపడిపోయిన ప్రజలు..?

దేశంలో సామాన్య ప్రజల జీవితాలను మెల్లగా, నిశ్శబ్దంగా మింగేస్తున్న అతిపెద్ద సంక్షోభం ఏదైనా ఉందంటే అది ద్రవ్యోల్బణమే. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రజల జేబులను ఖాలీ చేస్తున్న ఈ సమస్య ఇప్పుడు రాజకీయ చర్చల్లోనూ, సామాజిక ఉద్యమాల్లోనూ ప్రాధాన్యత కోల్పోయింది. ఒకప్పుడు పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి పెరిగినా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగేవి. ఇప్పుడు ఐదు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ఎక్కడా పెద్దగా స్పందన కనిపించడం లేదు. మే 15న లీటరుకు రూ.3 పెరిగిన ఇంధన ధరలు, ఇప్పుడు మళ్లీ 90 పైసలు పెరగడం ప్రజలపై అదనపు భారాన్ని మోపింది.

ద్రవ్యోల్బణం అంటే కేవలం పెట్రోల్ ధరలు పెరగడమే కాదు. అది ప్రతి ఇంటి వంటగదిలో కనిపించే సంక్షోభం. ప్రతి రోజు మార్కెట్‌కి వెళ్లే గృహిణి చేతిలో కనిపించే ఆందోళన. నెలాఖరులో జీతం సరిపోక అప్పుల బాట పడుతున్న మధ్యతరగతి ఉద్యోగి మనసులో కనిపించే అసహాయం. కానీ ఇప్పుడు దేశ రాజకీయాల దృష్టి ప్రజల జీవన సమస్యలపై లేదు. హిందూ-ముస్లిం రాజకీయాలు,రాజకీయపార్టీలు , నాయకులు పరస్పరం దూషించుకోవడం, ఎన్నికల లెక్కలు, భావోద్వేగ ప్రచారాలు, బుల్డోజర్ చర్యలు, జనాభా రాజకీయాలు… ఇవే ప్రధాన చర్చలుగా మారాయి.

ప్రజల అసలు సమస్యలు మాత్రం పక్కకు నెట్టబడ్డాయి. ప్రపంచ సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధాలు, ముడి చమురు ధరలు, డాలర్ బలపడటం వంటి కారణాలను చూపిస్తూ ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజల అవసరాలకు సంబంధించిన అనేక వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగాయి. దాని ప్రభావం కూరగాయలపై పడింది. టమాట, ఉల్లి, బంగాళాదుంప వంటి నిత్యావసర కూరగాయల ధరలు మార్కెట్లలో మళ్లీ పెరుగుతున్నాయి. వంటనూనెల ధరలు తగ్గుతాయని భావించిన సమయంలో అవి కూడా మళ్లీ ఎగబాకుతున్నాయి. పప్పుధాన్యాలు, బియ్యం, గోధుమ పిండి, పాల ఉత్పత్తులు, గ్యాస్ సిలిండర్లు — ఇవన్నీ సాధారణ కుటుంబ బడ్జెట్‌ను కుదేలు చేస్తున్నాయి.

పిల్లల స్కూల్ ఫీజులు, బస్ ఛార్జీలు, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు కూడా పెరుగుతున్నాయి. వైద్య ఖర్చులు మరింత భయంకరంగా మారాయి. ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం ఇప్పటికే మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా బలహీనపరుస్తున్నాయి. ఉద్యోగాలు స్థిరంగా లేవు. చిన్న వ్యాపారులు అమ్మకాలు తగ్గిపోవడంతో కష్టాల్లో ఉన్నారు. కానీ ఈ వాస్తవాలపై దేశ రాజకీయాల్లో గంభీర చర్చ కనిపించడం లేదు.

అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ప్రజలు కూడా ఈ పరిస్థితిని తమ విధిగా అంగీకరించడం ప్రారంభించారు. “ధరలు పెరగడం సహజం”, “ఏం చేయలేం”, “ప్రపంచ పరిస్థితుల ప్రభావం” అంటూ ప్రజలు మానసికంగా ఓటమిని అంగీకరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు ప్రశ్నించడం మానేసినప్పుడు ప్రభుత్వాలు బాధ్యతను కూడా మరిచిపోతాయి.

ద్రవ్యోల్బణం ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు; అది సామాజిక అసమానతలను పెంచే శక్తి. ధనవంతులకు ధరల పెరుగుదల పెద్ద సమస్య కాకపోవొచ్చు. కానీ రోజువారీ ఆదాయంపై ఆధారపడే కూలీలు, చిన్న ఉద్యోగులు, పెన్షనర్లు, చిన్న వ్యాపారులు మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నారు. ఒకప్పుడు నెలకు సరిపోయే జీతం ఇప్పుడు పది రోజులు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడుతోంది.

దేశంలో ప్రజల అసలు సమస్యలపై రాజకీయ చర్చ మళ్లీ మొదలవ్వాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్య, వైద్యం, వ్యవసాయం, వేతనాలు — ఇవే రాజకీయాల కేంద్రబిందువుగా మారాలి. ప్రజల జేబు ఖాలీ అవుతుంటే, దేశాభిమానం పేరుతో ఉపన్యాసాలు ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదు. ప్రజలకు కావలసింది భావోద్వేగ ప్రసంగాలు కాదు జీవన అవకాశాలు.

ఇప్పుడు అత్యవసరంగా కావలసింది ధరల నియంత్రణపై స్పష్టమైన కార్యాచరణ. ఇంధన ధరలపై పన్నుల తగ్గింపు, నిత్యావసర వస్తువుల సరఫరాపై పర్యవేక్షణ, మధ్యతరగతి మరియు పేదలపై పన్ను భారం తగ్గించడం, ప్రజా రవాణా బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈ నిశ్శబ్ద ద్రవ్యోల్బణ దాడి సామాన్యుడి భవిష్యత్తును పూర్తిగా మింగివేస్తుంది.

ప్రజల జేబులు ఖాలీ అవుతున్నప్పుడు… దేశ రాజకీయాలు ఇంకా వేరే దారిలో నడవడం నిజంగా ఆందోళనకరం…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *