సాధారణంగా సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు లేదా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచే విదేశాలకు భారీగా చేపలు, రొయ్యల ఎగుమతులు జరుగుతుంటాయి. కానీ, సముద్ర తీరం లేని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే తొలి అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల హబ్ ను కోహెడలో నిర్మిస్తూ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఇది తెలంగాణ ఆర్థిక రంగాన్ని మార్చడమే కాకుండా, అంతర్జాతీయంగా రాష్ట్రానికి ఒక విశిష్ట గుర్తింపును తీసుకురానుంది.
తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులతో పాటు మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన సుమారు 26వేల జలాశయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా భారీగా చేపల ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం స్థానిక మార్కెట్లలో దలారిల వ్యవస్థ వల్ల మత్స్యకారులకు సరైన ధర లభించడం లేదు. కోహెడ హబ్ అందుబాటులోకి వొస్తే మత్స్యకారులు తమ ఉత్పత్తులను నేరుగా అంతర్జాతీయ గ్లోబల్ మార్కెట్ ధరలకు విక్రయించుకోవొచ్చు. దీనివల్ల వారి జీవన ప్రమాణాలు అమాంతం పెరుగుతాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు ఐదువేల మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. కేవలం చేపలు పట్టే వారికే కాకుండా.. లాజిస్టిక్స్, ఐస్ ప్లాంట్లు, ప్యాకేజింగ్ పరిశ్రమలు, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్, మరియు రవాణా రంగంలో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ చేపలు పొరుగు రాష్ట్రాల మీదుగా విదేశాలకు వెళ్లేవి. దీనివల్ల పన్నుల ఆదాయం ఆయా రాష్ట్రాలకు వెళ్లేది. ఇప్పుడు కోహెడ నుంచే నేరుగా ఎగుమతులు జరగడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి నేరుగా కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం మరియు పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతుంది.
కోహెడ ప్రాంతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ), ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్ ఆర్) అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కస్టమ్స్ క్లియరెన్స్ కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడి నుంచి కేవలం కొన్ని గంటల్లోనే గల్ఫ్ దేశాలు, యూరప్, ఆగ్నేయాసియా మరియు అమెరికా మార్కెట్లకు చేపలు విమానాల ద్వారా ఎగుమతి అవుతాయి. ఇది అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతుంది. రూ.47 కోట్లతో నిర్మిస్తున్న దేశంలోనే తొలి అంతర్జాతీయ కొహెడ మంచినీటి చేపల ఎగుమతుల హబ్ తెలంగాణ ప్రగతికి ఒక సరికొత్త మైలురాయిగా నిలువనుంది. సముద్ర తీరం లేని ల్యాండ్ లాక్‌డ్ రాష్ట్రమైన తెలంగాణ, మంచినీటి మత్స్య సంపద ఎగుమతులలో గ్లోబల్ మ్యాప్‌పై నిలవడం సాధారణ విషయం కాదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఐదువేల మందికి ఉపాధి లభించడమే కాకుండా, దలారీల దోపిడీకి గురవుతున్న మత్స్యకారులకు అంతర్జాతీయ మార్కెట్ ధరలు దక్కనున్నాయి. ఐటీ, ఫార్మా రంగాలకే పరిమితమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.. ఈ హబ్ ద్వారా అంతర్జాతీయ ఆహార ఎగుమతుల్లోనూ ప్రపంచ స్థాయికి చేరనుంది.
తెలంగాణ జలాశయాలలో పెరిగే మంచినీటి చేపలకు అంతర్జాతీయంగా, ముఖ్యంగా ఆసియా మరియు గల్ఫ్ దేశాలలో భారీ డిమాండ్ ఉంది. కోహెడ హబ్ అందుబాటులోకి వొస్తే శంషాబాద్ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) లాజిస్టిక్స్ ద్వారా క్రింది దేశాలకు నేరుగా ఎగుమతులు జరగనున్నాయి. గల్ఫ్ దేశాలైన దుబాయ్ , సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్‌లలో ఉండే భారతీయ, ఆసియా జనాభా మంచినీటి చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆగ్నేయాసియా దేశాలైన చైనా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలకు లైవ్ (సజీవ) చేపలు ఫిష్ ఫిల్లెట్స్ (కట్ చేసిన ముక్కలు) ఎగుమతి అవుతాయి. పాశ్చాత్య దేశాలైన అమెరికా , బ్రిటన్ కొన్ని యూరోపియన్ దేశాలకు చెందిన సూపర్ మార్కెట్లలో ‘రెడీ-టు-కుక్’ ప్యాకేజ్డ్ చేప ఉత్పత్తులకు మార్కెట్ ఎక్కువ. కొర్రమీను కు అంతర్జాతీయ మార్కెట్లో ‘ప్రీమియం’ ధర లభిస్తుంది.
ముఖ్యంగా గల్ఫ్ మరియు ఆగ్నేయాసియా దేశాలలో దీని ఔషధ గుణాల వల్ల భారీ డిమాండ్ ఉంది. రోహు, బొచ్చె గల్ఫ్ దేశాలలో ఉండే ప్రవాస భారతీయులు, బంగ్లాదేశీయులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. రవ్వలు / తిలాపియా ను “లిక్విడ్ చికెన్” అని కూడా పిలుస్తారు. అమెరికా, ఐరోపా దేశాలలో ముళ్ళు లేని ‘ఫిష్ ఫిల్లెట్స్’ రూపంలో తిలాపియాకు తిరుగులేని మార్కెట్ ఉంది. తెలంగాణలోని ప్రాజెక్టులలో కేజ్ కల్చర్ (పంజర పెంపకం) ద్వారా దీనిని భారీగా ఉత్పత్తి చేస్తున్నారు. ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ (మంచినీటి రొయ్యలు): సముద్రపు రొయ్యలతో పోలిస్తే మంచినీటి పెద్ద రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో ధర, డిమాండ్ చాలా ఎక్కువ.
అయితే, ఈ గ్లోబల్ ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య నడుస్తున్న రాజకీయ ‘క్రెడిట్ వార్’ అభివృద్ధికి అడ్డంకి కాకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టును కేవలం వోట్ల కోణంలో చూడకుండా, నిర్దేశిత ఆగస్టు 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. పరిపాలనలో సాంకేతికత ఎంత ముఖ్యమో, క్షేత్రస్థాయి మానవీయ కోణం కూడా అంతే ముఖ్యం. ఒకవైపు కొహెడ లాంటి అంతర్జాతీయ హబ్ లతో మత్స్యకారుల తలరాతలను మారుస్తూనే, మరోవైపు యాప్ నిబంధనల పేరుతో అన్నదాతల నోట్లో మట్టి కొట్టకుండా చూడాలి. సాంకేతికత ఎప్పుడూ రైతుకు సహాయకారిగా ఉండాలి కానీ, వాళ్లను ఇబ్బంది పెట్టే సంకెళ్లు కాకూడదని ప్రభుత్వం గుర్తించాలి.





