పోలీసుల నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలు తీసింది

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం రాత్రి  ఆరుగురు ప్రాణాలను బలిగొన్న దారుణం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోక్సో కేసు నమోదైందన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చడం మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన. అయితే ఈ సంఘటనను కేవలం ఒక వ్యక్తి క్రూరత్వంగా మాత్రమే చూడటం వాస్తవాన్ని కప్పిపుచ్చినట్లే అవుతుంది. ఈ రక్తపాతం వెనుక వ్యవస్థ వైఫల్యం ఉందా? పోలీసుల నిర్లక్ష్యం కూడా కారణమా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, నిందితుడిపై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అలాంటి కేసులు సాధారణ క్రిమినల్ కేసులు కావు. అవి చిన్నారుల భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాలు. ఫిర్యాదు నమోదైన వెంటనే బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడం, నిందితుడి ప్రవర్తనను నిశితంగా గమనించడం, అతడు ప్రతీకారానికి దిగే అవకాశాలను అంచనా వేయడం, అవసరమైతే అదుపులోకి తీసుకోవడం లేదా చట్టపరమైన పరిమితుల్లో కఠిన నిఘా కొనసాగించడం పోలీసుల బాధ్యత. ఈ ప్రక్రియలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగి ఉంటే, ఆ నిర్లక్ష్యానికీ ఈ ప్రాణనష్టంలో వాటా ఉందనే ప్రశ్నను విస్మరించలేం.

నేరస్తుణ్ణి  శిక్షించడం కంటే,  చేసిన నేరాన్ని నిరోధించడమే ఉత్తమ పోలీసింగ్.” అని వింటూ ఉంటాం … కానీ మన వ్యవస్థలో తరచూ కనిపించేది అందుకు విరుద్ధమైన దృశ్యం. నేరం జరిగిన తర్వాత హడావుడి, ప్రత్యేక బృందాలు, ప్రకటనలు, సస్పెన్షన్లు, పరిహారాలు… ఇవన్నీ జరుగుతాయి. కానీ నేరం జరగకుండా అడ్డుకోవడంలో మాత్రం యంత్రాంగం విఫలమవుతోంది. షాబాద్ ఘటన ఈ లోపాన్ని మరోసారి బట్టబయలు చేసింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీసింగ్‌లో సాంకేతికత పెరిగింది. సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, షీ టీమ్స్, డయల్-100, ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ప్రజల భద్రత కోసం వినియోగించబడుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే—ఇంత సాంకేతిక సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇప్పటికే నిందితుడిగా గుర్తించబడిన వ్యక్తి ఆరుగురి ప్రాణాలను బలిగొనే స్థితి ఎలా వొచ్చింది? వ్యవస్థకు సమాచారం లేదా? సమాచారం ఉంటే చర్య ఎందుకు లేదు? చర్య ఉంటే ఫలితం ఎందుకు లేదు?

ఇది ఒక్క షాబాద్ సమస్య కాదు. ఇటీవలి కాలంలో తెలంగాణలో కుటుంబ హత్యలు, చిన్నారులపై లైంగిక నేరాలు, మహిళలపై దాడులు, అనుమానాలతో హత్యలు, ప్రేమ వ్యవహారాల పేరుతో దారుణాలు పెరుగుతున్నాయి. ప్రతి ఘటన తర్వాత “దోషులను వదిలిపెట్టం” అనే ప్రకటనలు వినిపిస్తున్నాయి. కానీ వరుసగా కొత్త సంఘటనలు జరగడం చూస్తే, నేరస్థుల్లో చట్టం పట్ల భయం తగ్గుతోందా? అనే సందేహం కలగడం సహజం.

సమాజంలో విలువలు క్షీణిస్తున్నాయన్నది వాస్తవమే. కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం, అసహన సంస్కృతి, మద్యపానం, మాదకద్రవ్యాల ప్రభావం, కుటుంబ బంధాల బలహీనత, సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని రెచ్చగొట్టే ధోరణి—ఇవన్నీ నేరప్రవృత్తిని పెంచుతున్నాయి. అయితే ఇవన్నీ తెలిసిన విషయాలే. అందుకే పోలీసింగ్ కేవలం నేరం జరిగిన తర్వాత విచారణ చేయడానికే పరిమితం కాకూడదు. ప్రమాదకర వ్యక్తులను గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి.

పోక్సో చట్టం ఉద్దేశం చిన్నారులను రక్షించడం. కానీ ఒక పోక్సో కేసు నేపథ్యంలో చివరకు ఆరు ప్రాణాలు బలికావడం ఆ చట్టం అమలుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. కేసు నమోదు చేయడమే బాధ్యత కాదు; బాధితులకు భద్రత కల్పించడం కూడా చట్ట అమలులో భాగమే. బాధిత కుటుంబం ప్రమాదంలో ఉందన్న సూచనలు ఉంటే, వాటిని విస్మరించడం తీవ్రమైన పోలీసుల  వైఫల్యమే.

ఈ ఘటనపై ప్రభుత్వం కేవలం నిందితుడిని పట్టుకోవడం వద్దనే ఆగిపోకూడదు. సంబంధిత పోలీసు అధికారుల పాత్ర, కేసు దర్యాప్తు పురోగతి, బాధిత కుటుంబం నుంచి గతంలో వొచ్చిన ఫిర్యాదులు, రక్షణ కోసం చేసిన విజ్ఞప్తులు—అన్నింటిపైనా స్వతంత్ర విచారణ జరపాలి. నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో ప్రజలకు తెలియాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రతి దారుణం తర్వాత నిందితుడిని అరెస్టు చేయడం, ఆ తర్వాత ప్రజలు మరచిపోవడం అనే తంతు  కొనసాగుతూనే ఉంటుంది.

ఒక నాగరిక సమాజంలో ప్రజలు పోలీసులను చూసి భద్రతను ఆశిస్తారు . కానీ నేరం జరిగిన తర్వాత మాత్రమే పోలీసులు కనిపిస్తారనే భావన ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చట్టం వేగంగా స్పందిస్తుందన్న నమ్మకం నేరస్థుల్లో భయాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆ విశ్వాసాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎన్నడూ లేనంతగా ఉంది.

షాబాద్ ఘటన ఆరు ప్రాణాలను మాత్రమే బలితీయలేదు; పోలీసింగ్ సామర్థ్యంపై, పాలనా బాధ్యతపై, సమాజ విలువలపై కూడా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పకపోతే రేపు మరో షాబాద్, మరో విషాదం మన ముందుకు రాదని చెప్పలేం .

ప్రభుత్వం ఈ సంఘటనను ఒక హెచ్చరికగా స్వీకరించాలి. పోక్సో వంటి సున్నితమైన కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రమాద సూచనలు ఉన్న బాధిత కుటుంబాలకు తక్షణ భద్రత కల్పించాలి. పోలీసు అధికారుల బాధ్యతను స్పష్టంగా నిర్ధారించే జవాబుదారీ వ్యవస్థను బలోపేతం చేయాలి. నేరస్థులకు కఠిన శిక్షలు ఎంత అవసరమో, అధికారుల నిర్లక్ష్యానికీ అంతే కఠిన బాధ్యత ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేరస్తుడి చేతిలోని ఆయుధం ఎంత ప్రమాదకరమో, వ్యవస్థ నిర్లక్ష్యం కూడా అంతే ప్రాణాంతకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *