కాళేశ్వ‌రం వివాదం మ‌ధ్య న‌ష్ట‌పోతున్న రైతులు

తెలంగాణ సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని ప్రచారం చేసిన ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’  నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహా రణరంగంగా మారింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటు, లీకేజీల చుట్టూ తిరుగుతున్న వివాదం… ఇంజనీరింగ్ లోపాల నుండి రాజకీయ కక్షసాధింపుల వైపు మళ్ళింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ) నివేదికల ప్రకారం 2027 మధ్య నాటికి కానీ ఇక్కడ పూర్తిస్థాయి శాస్త్రీయ పునరావాస పనులు పూర్తి కావు. అయితే, ఈ రెండేళ్ల సుదీర్ఘ కాలయాపన వెనుక నలిగిపోతున్నది ఎవరు? సాంకేతిక సవాళ్లకు, రాజకీయ సవాళ్లకు మధ్య నలిగిపోతున్న సామాన్య అన్నదాతల భవిష్యత్తు ఏమిటి? అనే అంశం ఇక్క‌డ అత్యంత కీల‌కం.

    ప్రస్తుతం గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోయి సముద్రంలో కలుస్తోంది. కానీ, డ్యామ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం బ్యారేజీల అన్ని గేట్లను ఎత్తి ఉంచడం  వల్ల ఒక్క చుక్క నీటిని కూడా నిల్వ చేయలేని నిస్సహాయ స్థితి ఏర్పడింది.దీన్ని  సాకుగా తీసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ ‘చలో కన్నెపల్లి’ కి పిలుపునిచ్చింది. బాహుబలి మోటర్లను ఆన్ చేసి రైతులకు నీరివ్వాలని, చేతకాకపోతే బాధ్యతలు తమకు అప్పగించాలని సవాల్ విసురుతోంది. మరోవైపు, గత ప్రభుత్వ అవినీతి, కమీషన్ల కోసమే తప్పుడు డిజైన్లు చేశారని, ఇప్పుడు నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోయి దిగువన ఉన్న 44 గ్రామాలు, భద్రాచలం పట్టణానికే ముప్పు వొస్తుందని అధికార కాంగ్రెస్ భద్రతా కోణాన్ని ముందుంచుతుంది. ఈ రెండు వాదనల మధ్య బీజేపీ సైతం చేరి.. ఇదంతా రెండు పార్టీల ఉమ్మడి రాజకీయ నాటకమని విమర్శిస్తోంది.  నీటి త‌ర‌లింపుపై రిస్క్ తీసుకోవడం ఎంత‌వ‌ర‌కు సాధ్య‌మ‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.
ఇంజనీరింగ్ నిపుణుల ప్రకారం.. కన్నెపల్లి పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే ముందుగా బ్యారేజీల గేట్లు దించి నీటిని కనీస మట్టానికి నిల్వ చేయాలి. కానీ ఎన్‌డీఎస్ ఏ  తుది నివేదిక ప్రకారం, బ్యారేజీల పునాదుల కింద సీపేజ్ (నీటి లీకేజీ) మరియు పైపింగ్ సమస్యల వల్ల నిర్మాణ స్థిరత్వం దెబ్బతింది. ఈ స్థితిలో నీటిని నిల్వ చేయడం ‘మానవ నిర్మిత మహా విపత్తు’ కు దారితీయవొచ్చు. ఐఐటీ బాంబే, సీడబ్ల్యూపీఆర్ఎస్ పూణే వంటి జాతీయ సంస్థల ఆధ్వర్యంలో జియోటెక్నికల్ సర్వేలు ముగిసి, 2027 వర్షాకాలం నాటికి కానీ శాశ్వత మరమ్మతులు పూర్తి కావు. అంతవరకు పంపులు నడపడం సాంకేతికంగా అత్యంత ప్రమాదకరం.
బుర‌ద‌జ‌ల్లుడు రాజ‌కీయాల‌ను పక్కనబెట్టి, రైతులకు నీరందించడానికి నీటిపారుదల రంగ నిపుణులు కొన్ని అత్యవసర ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు మేడిగడ్డలో దెబ్బతిన్న 7వ బ్లాక్ చుట్టూ తాత్కాలికంగా కోఫర్ డ్యామ్‌లు (తాత్కాలిక రక్షణ గోడలు) నిర్మించి, మిగిలిన సురక్షిత బ్లాకుల పరిధిలో పాక్షికంగా నీటిని నిల్వ చేసి పంపులను నడపవొచ్చు. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ), ఎల్లంపల్లి ప్రాజెక్టుల నీటిని వరద కాలువ ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరులకు మళ్లించి, చివరి ఆయకట్టు భూములను కాపాడాలి. స్థానిక వాగులు, వంకల ద్వారా వొచ్చే వరదను మైక్రో-ఇరిగేషన్ గొలుసుకట్టు చెరువుల్లోకి గరిష్టంగా నింపి భూగర్భ జలాలను కాపాడుకోవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట పునాది దెబ్బతిన్నప్పుడు అప్పటి పాలకులు రాజకీయాలు చేయలేదు. ‘మిత్రా కమిటీ’ ని రంగంలోకి దించి, తాత్కాలికంగా కోఫర్ డ్యామ్ ల‌, సిమెంట్ గ్రాటింగ్ ద్వారా లీకేజీలను అరికట్టి సాగునీటిని అందిస్తూనే, ఎగువన సరికొత్తగా కాటన్ బ్యారేజీని నిర్మించి శాశ్వత పరిష్కారం చూపారు. నేడు కాళేశ్వరం విషయంలోనూ అదే స్ఫూర్తి అవసరం.
    ‘కాళేశ్వరం’ అనేది ఒకరి విజయం, మరొకరి వైఫల్యం కావొచ్చు. కానీ వందల టీఎంసీల నదీ జలాలు సముద్రం పాలు కావడం, చేతికొచ్చిన పంటలు ఎండిపోవడం అనేది మాత్రం తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న ‘మహా నష్టం’. రాజకీయ మైలేజ్ కంటే రాష్ట్ర సాగునీటి భద్రత  ముఖ్యం. ఇప్పటికైనా పాలకులు కాలయాపన వీడి, నిపుణుల సూచనల మేరకు తాత్కాలిక ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ద్వారా రైతులకు భరోసా కల్పించాల్సిన అత్యంత కీలక సమయం ఇది. కానీ ప్ర‌భుత్వం ఈ దిశ‌గా ముందుకు పోవ‌డంలేదు.  రాజకీయ పంతాలు, నివేదికల సాంకేతికతల వెనుక అసలైన విషాదం గ్రామీణ తెలంగాణలో కనిపిస్తోంది.
కాళేశ్వరం నీటిని నమ్ముకుని ఉత్తర తెలంగాణ (కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్) జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వేసిన నారుమళ్లు, పత్తి పంటలు సాగునీరు అందక ఎండిపోతున్నాయి. బ్యారేజీలలో నీటి నిల్వ లేకపోవడంతో పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. బోర్ బావులు ఎండిపోవడంతో రైతులు మళ్లీ అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. పెట్టుబడి నష్టపోతుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమై, మళ్లీ నగరాలకు వలసల ముప్పు పొంచి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఒక నీటిపారుదల నిర్మాణం మాత్రమే కాదు, అది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును శాసించే ఒక అస్త్రంగా మారింది. నిరూపించాల్సిన అవినీతి ఆరోపణలు ఒకవైపు, కాపాడాల్సిన రైతాంగ ప్రయోజనాలు మరోవైపు ఉన్న వేళ… ఈ రాజకీయ యుద్ధంలో తుది విజేత ఎవరనేది కాలమే నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *