– 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త పేపర్
– ఏళ్ల తరబడి భద్రంగా దాచుకునేలా ప్రత్యేక తయారీ
– మీ సేవలో జారీ చేసే సర్టిఫికెట్లకు ఇక లామినేషన్ పని లేదు
– ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: ప్రభుత్వ ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు రాజ్ ఠాకూర్, విజయ రమణారరావు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి. రవికిరణ్, అధికారులు, ప్రింటింగ్ ఏజెన్సీలు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్లో 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, అనధికార నకళ్లను అరికట్టేలా వీటిని రూపొందించారు. భద్రతా కారణాలతో ఈ ఫీచర్ల పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ పేపర్ సులభంగా చినిగిపోదు. నీళ్లు పడినా త్వరగా దెబ్బతినదు. సాధారణ వినియోగం, మడతపెట్టడం, ఎక్కువ కాలం భద్రపరచడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో సర్టిఫికెట్లను ఏళ్ల తరబడి మంచి స్థితిలో దాచుకునే అవకాశం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో వాటికి లామినేషన్ చేయించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు ఉపయోగించే సర్టిఫికెట్లు ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. కొన్ని పత్రాలను జీవితాంతం భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాంటి ధ్రువపత్రాలు త్వరగా పాడవకుండా చూడటంతో పాటు వాటి విశ్వసనీయతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని మరింత పెంచే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి వివరించారు. కొత్త సెక్యూరిటీ పేపర్‌తో సర్టిఫికెట్ల మన్నిక పెరగడంతో పాటు నకిలీలను అరికట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రభుత్వ ధ్రువపత్రాలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 2011 నుంచి మీ సేవ సర్టిఫికెట్ల ముద్రణకు ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పేపర్ స్థానంలో మరింత నాణ్యత, భద్రత, మన్నిక కలిగిన కొత్త పేపర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు దీర్ఘకాలం భద్రపరచాల్సిన ఇతర ప్రభుత్వ పత్రాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





