– రాష్ట్రానికి ఐదు రోప్‌వేలు, మూడు ఆర్వోబీలకు ఆమోదం
– కేంద్ర మంత్రి గడ్కరీతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి భేటీ
– పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై సానుకూల స్పందన
– తెలంగాణ అభివృద్ధికి కీలక ముందడుగు
– ఎన్‌హెచ్-65 విస్తరణ పనులు జనవరిలో ప్రారంభిస్తామని హామీ
– హైదరాబాద్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌పై కొత్త డీపీఆర్‌కు ఆదేశాలు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్రానికి అవసరమైన కీలక రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేలు సహా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం దిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచి ప్రజల ప్రయాణ కష్టాలను తగ్గించడంతోపాటు రాష్ట్ర ఆర్థిక, పర్యాటక అభివృద్ధికి దోహదపడే పలు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై గడ్కరీ సానుకూలంగా స్పందించి పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతోపాటు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో ఒకటైన ఎల్బీనగర్-హయత్‌నగర్ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. ఈ మార్గంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 54 కాలనీల్లో 10 లక్షల మందికిపైగా నివసిస్తున్నారని, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం ప్రయాణించే ఈ మార్గంలో ట్రాఫిక్‌తోపాటు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి నితిన్ గడ్కరీకి వివరించారు. ఈ మార్గంలో ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలుపగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి వార్షిక ప్లాన్‌లో చేర్చి ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతోపాటు ప్రయాణ సమయం ఆదా కానుంది.హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై పలు సందర్బాల్లో కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన అంశాలను గుర్తు చేశారు. 17 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఫ్లైఓవర్లు నిర్మాణం జరుగుతున్నా ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ రహదారిపై ట్రాఫిక్ లోడ్ విపరీతంగా పెరిగిందని, హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్-65 6G2 లేన్ల విస్తరణ పనులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి త్వరగా చేపట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు కీలకమైన ఈ రహదారి విస్తరణ పనులకు నవంబర్‌లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 2027 జనవరిలో పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
సోమశిల వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేలా ఎన్‌హెచ్-167కెపై కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కోసం మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో సోమశిల నుంచి సంగమేశ్వర వరకు నిర్మించే ఈ బ్రిడ్జి ద్వారా తిరుపతి వెళ్లే వారికి సుమారు 80కి.మీ దూరం తగ్గి దాదాపు 3 గంటల ప్రయాణ సమయం తగ్గుతుందని మంత్రి వివరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సోమశిల ఆలయం వద్ద పర్యాటక రంగం అభివృద్ధి చెంది తెలంగాణలో ఒక మైలురాయిగా నిలవనుందని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. పర్యాటకం అభివృద్ధి చెందడంతో స్థానికంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడనున్నాయని, ఆర్ధిక కార్యకలాపాలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు. హైదరాబాద్-శ్రీశైలం ఎన్‌హెచ్-765పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పర్యాటక రంగానికి రోప్‌వేలతో కొత్త ఊతం
తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు పర్వతమాల పథకం కింద ఐదు రోప్‌వేల ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. దీనివల్ల పర్యాటకులకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు ఆయా ప్రాంతాల్లో స్థానిక ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనపైనా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు ముందుకు సాగితే రెండు రాష్ట్రాల మధ్య రవాణా మరింత మెరుగుపడనుంది.
రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఇబ్బందులకు పరిష్కారం
సేతు బంధన్ పథకం కింద తెలంగాణలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని, 34 రహదారి పనులకు సీఆర్ఐఎఫ్ నుంచి నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన నితిన్ గడ్కరీ అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పుల్లూరు-అలంపూర్-జట్రపోలు-పెంట్లవెల్లి-కొల్లాపూర్-లింగాల-అచ్చంపేట-డిండి-దేవరకొండ-మల్లేపల్లి-నల్గొండ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనను మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనపై కూడా నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్‌లో ఐఆర్సీ సమావేశాలకు గడ్కరీని ఆహ్వానించిన మంత్రి
నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి వెంకటరెడ్డి కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన ఆయన కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. సమావేశంలో ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంవోఆర్టీహెచ్ అధికారులు, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





