కేంద్రీకృత పీఎంయూ టెండర్లను రద్దు చేయాలి

– గతంలో మాదిరి పాఠశాలను ఒక యూనిట్ గా తీసుకోవాలి
– పాత విధానం వల్ల వేలాది చిరు వ్యాపారులకు భ‌ద్ర‌త
– 20 శాతం కమీషన్లతో విద్యార్థుల పొట్ట కొడుతున్న వైనం
– ఏపీలో విఫలమై రద్దు చేసిన విధానమిది
– మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నిత్యావసర సరుకుల సరఫరా కోసం ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత పీఎంయూ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్  డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావును కలిసి, ప్రభుత్వం మార్చిన టెండర్ నిబంధనల వల్ల వేలమంది స్థానిక వెండర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను విన్న అనంతరం హరీశ్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గురుకులాలను చిన్నచూపు చూస్తూ పేద విద్యార్థులకు పెట్టే భోజనంపై కూడా కక్కుర్తి పడుతూ, రూ.800 కోట్ల టెండర్లలో కమీషన్ల దందా నడుపుతోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫాంలు, నోట్ బుక్కులు, ట్రంక్ పెట్టెల ఇతర వస్తువుల కొనుగోళ్ల టెండర్లలో దాదాపు రూ. 2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని గతంలోనే తాము ఆధారాలతో సహా నిరూపించామని హరీశ్రావు గుర్తుచేశారు. ఆ దోపిడీతో కూడా కాంగ్రెస్ పాలకుల కడుపు నిండలేదని.. ఇప్పుడు చివరకు పేద విద్యార్థుల కడుపునింపే నిత్యావసర సరుకులపైనా 20 శాతం కమీషన్లు దండుకోవాలని చూడడం వీరి కక్కుర్తికి నిదర్శనం అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,023 గురుకులాలు, 3 వేలకు పైగా సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గతంలో పాఠశాలను యూనిట్‌గా తీసుకుని స్థానిక వ్యాపారులు సరుకులు సరఫరా చేసేవారని గుర్తుచేశారు. అయితే స్థానిక వెండర్లను తప్పించేందుకు జీవో 17 పేరుతో మొదట జిల్లా యూనిట్ అని, ఆ తర్వాత రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల భారీ ఈఎండీలు పెట్టి వారిని పోటీ లేకుండా చేశారని ఆక్షేపించారు. వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించినా లెక్కచేయకుండా, ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా చేసి పీఎంయూ విధానం ద్వారా రూ. 800 కోట్ల కాంట్రాక్టును ఒకే వ్యక్తికి, అదీ గతంలో బ్లాక్‌లిస్టులో పెట్టిన సంస్థకు అప్పగించడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. గతంలో నిబంధనల ఉల్లంఘన కారణంగా సివిల్ సప్లైస్‌లో రూ. 65 కోట్ల డిపాజిట్ జప్తునకు గురై బ్లాక్‌లిస్టులో ఉన్న నాకాఫ్ సంస్థకు, అలాగే ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో నిషేధానికి గురైన కంపెనీకి ఈ టెండర్‌ను ఎలా కట్టబెడతారని హరీశ్ రావు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం సబ్-కాంట్రాక్టులకు తావులేకపోయినా తెరవెనుక 12 మందికి సబ్ కాంట్రాక్టులు, అక్కడి నుంచి 33 జిల్లాలకు పంపకాలు చేసి ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున ఏకంగా రూ.66 కోట్ల గుడ్‌విల్, ప్రతినెల బిల్లుల్లో 20 శాతం కమీషన్ల ఒప్పందం కుదుర్చుకున్నారని పత్రికా కథనాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని ప్రైవేట్ కార్యాలయం కేంద్రంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చక్రం తిప్పుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో ఇదే కాంట్రాక్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కూడా సరిగ్గా ఇదే కేంద్రీకృత విధానాన్ని అమలు చేయాలని చూశారని హరీశ్ రావు గుర్తుచేశారు. అక్కడ మూడు నెలలు నడిపిన తర్వాత ఈ విధానం ఆచరణ సాధ్యం కాదని తేలడం, సదరు కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో అక్కడి ప్రభుత్వమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఆ టెండర్‌ను రద్దు చేసి, తిరిగి పాత పద్ధతిలోనే స్థానిక ప్రొక్యూర్మెంట్ విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. పక్క రాష్ట్రంలో అట్టర్‌ఫ్లాప్ అయి, లోపభూయిష్టమని తేలి రద్దు చేసిన విధానాన్ని.. ఇప్పుడు ఎవరి స్వలాభం కోసం, ఎవరి జేబులు నింపడానికి తెలంగాణలో బలవంతంగా అమలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ స్వార్థ ప్రయోజనాలు, కమీషన్ల కక్కుర్తి కోసం పేద విద్యార్థుల కడుపు ఎందుకు కొడతారని నిలదీశారు. స్థానిక వెండర్లు సప్లై చేసే సాధారణ రేట్ల కంటే 35 నుంచి 45 శాతం అధిక ధరలకు టెండర్లను ఖరారు చేశారని, ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల కంటే ఎక్కువకు కాంట్రాక్టు ఇస్తే విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితి ఎక్కడుంటుందని నిలదీశారు.
జూన్ నుంచే సరుకులు ఇవ్వాల్సిన సదరు సంస్థ ఇప్పటివరకు సరఫరా చేయలేకపోయిందని, హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు పాత లోకల్ వెండర్లను బతిమిలాడి మూడు నెలలు సరుకులు తెప్పించుకున్నారని చెప్పారు. దసరా పండుగ సెలవులకు ముందు రాష్ట్రంలోని దాదాపు 4 వేల హాస్టళ్లలో కేవలం 280 కేంద్రాలకే నామమాత్రంగా సరుకులు పంపారని, అవి కూడా ఎలాంటి బ్రాండ్, బిల్లు, ఎక్స్‌పైరీ డేట్ లేని అత్యంత నాసిరకం వస్తువులని ఆగ్రహం వ్యక్తం చేశారు.అందుకే ప్రభుత్వం వెంటనే మొండివైఖరి వీడి, కమీషన్ల కోసం తెచ్చిన ఈ కేంద్రీకృత పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గతంలో అమలులో ఉన్న విధంగా డిస్టిక్ట్ పర్చేస్ కమిటీ ద్వారా, పాఠశాలను ఒక యూనిట్‌గా పరిగణించి స్థానిక వెండర్లకే నిత్యావసర సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు. దీనిపై ఆధారపడి బతుకుతున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని, అంతేకాకుండా స్థానికంగా జవాబుదారీతనం పెరిగి పిల్లలకు నాణ్యమైన ఆహారం అందుతుందని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఆరోగ్యం, చిరు వ్యాపారుల పొట్టకొట్టే ఈ అవినీతి నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, బాధిత కుటుంబాల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *