– నిజాంను కీర్తించడం కాంగ్రెస్, బీఆర్ఎస్ కపట నాటకం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : నిజాం నిరంకుశ పాలనను, రజాకార్ల అకృత్యాలను కీర్తిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న రాజకీయాలు సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ, ‘ఆపరేషన్ పోలో’ వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా మల్కాజ్‌గిరిలో పటేల్ విగ్రహానికి ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరైన అధికారిక విమోచన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ చరిత్రకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ దశాబ్దాలుగా పోరాడిందని గుర్తుచేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ఎంఐఎం ఒత్తిడి కారణంగా గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని, కానీ అమరుల త్యాగాలను గౌరవిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ 2022 నుంచి అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బీఆరఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ చారిత్రక దినాన్ని ‘విలీన దినోత్సవం’గా పేర్కొనడం అత్యంత సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థాన ప్రజలు చేసిన రక్తతర్పణాన్ని, పోరాటాన్ని కేవలం విలీనం అనే పదంతో కుదించలేమన్నారు. భవిష్యత్ తరాలకు ఈ చరితార్థుల త్యాగాలు, పోరాట సత్యాలు తెలియాలంటే ఈ ఘట్టాన్ని పాఠ్యపుస్తకాల్లో సముచితంగా చేర్చాలని డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గతంలో కేసీఆర్.. నిజాం పాలనను కీర్తించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అమాయకులను పొట్టనబెట్టుకున్న పరకాల ఊచకోతను, బైరాన్‌పల్లి నరమేధాన్ని, నిజాం-రజాకార్ల కాలంలో మహిళలపై జరిగిన అకృత్యాలను వారు ఎలా మరిచిపోయారని నిలదీశారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడానికి నిరాకరించిన నిజాం, హైదరాబాద్‌ను ‘ఉస్మానిస్తాన’గా మార్చాలని, పాకిస్తాన్లో కలపాలని కుట్రలు పన్నాడని పేర్కొన్నారు. రాంజీ గోండ్ నుంచి స్వామి రామానంద తీర్థ వరకు ఎందరో జాతీయవాదులు “వందేమాతరం” నినాదంతో పోరాడారని గుర్తుచేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దృఢమైన నాయకత్వంలో చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ కారణంగానే నిజాం లొంగిపోయాడని, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత యూనియన్‌లో అంతర్భాగమైందని ఆయన ఉద్ఘాటించారు. అలాంటి మహనీయుడైన సర్దార్ పటేల్‌కు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు సంకోచించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇదే సందర్భంలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, చరిత్ర విస్మరించిన వీరులకు సముచిత గుర్తింపునిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





