– సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : రజాకార్ల కిరాతకాల నుంచి రక్షణ కోసం పల్లెపల్లెనా ప్రజలు బురుజులు ఎందుకు కట్టుకున్నారో అసెంబ్లీ సాక్షిగా నిజాంను కీర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఓటు బ్యాంకు దాహంతో, మజ్లిస్ పార్టీకి సాగిలపడి నిజాం నిరంకుశత్వాన్ని గొప్ప పాలనగా చిత్రీకరిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నైజంపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిజాంను వెనుకేసుకొస్తూ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో నిజాం పాలనను సమర్థించిన తీరును తప్పుపడుతూ నిజాం పాలన అంత గొప్పదైతే ప్రజాకవి బండి యాదగిరి ‘బండి వెనుక బండి కట్టి ఏ బండిల వస్తావు కొడకా నైజాం సర్కరోడా’ అంటూ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎందుకు గళమెత్తాల్సి వచ్చిందని సూటిగా ప్రశ్నించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల కవాతు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు జన్మదినం జరుపుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మోదీకి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల కిరాతక మారణకాండకు వ్యతిరేకంగా పోరాడిన అమరులకు, స్వాతంత్య్ర సమరయోధులకు ఈ వేదికపై నుంచి ఆయన ఘన నివాళులర్పించారు. నిజాం, రజాకార్లు సాగించిన దౌర్జన్యాలు, మారణహోమం, దేవాలయాలపై దాడులు, ప్రజల కష్టాలను అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మజ్లిస్ పార్టీకి భయపడి తొక్కిపెట్టే ప్రయత్నం చేశాయని తీవ్రంగా మండిపడ్డారు. నిజాంను గొప్పవాడిగా కీర్తించడం బాధాకరమని అన్నారు. నిజాం పాలన అంత గొప్పదైతే వందేమాతరం రామచంద్రరావు, భాగ్యరెడ్డి వర్మ, కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, పీవీ నరసింహారావు వంటి ఎంతోమంది మహానుభావులు నిజాం అణచివేతకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడాల్సి వచ్చింది.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రజాకార్ల కిరాతకాల నుండి రక్షణ కోసం తమ గ్రామాల్లో బురుజులు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది.. స్వతంత్ర భారతంలో భారత సైన్యం నిజాంపై ట్యాంకర్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘వందేమాతరం’ పాడుతూ ఉద్యమం చేసిన వందేమాతరం రామచంద్రరావుని ఆనాడు నిజాం ప్రభుత్వం మతపరమైన గేయమని నిషేధించినట్టే నేడు అదే రీతిలో మజ్లిస్ పార్టీ వందేమాతరాన్ని వ్యతిరేకిస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని 1980 నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు లాఠీదెబ్బలు తింటూ, కేసులు, జైళ్లను ఎదుర్కొని నిలకడగా పోరాడారని గుర్తుచేశారు. 2029 నాటికి తెలంగాణలోని ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ, ప్రతి ప్రభుత్వ పాఠశాల, ప్రతి చౌరస్తాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు నిర్వహించే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ జెండా ఎగరవేయడాన్ని అడ్డుకునే దమ్ము కాంగ్రెస్, బీఆరఎస్, మజ్లిస్‌లకు ఉందా అని సవాల్ విసిరిన ఆయన స్వాతంత్య్ర సమరయోధులను అవమానిస్తే ప్రజలు తగిన శాస్తి చేస్తారని హెచ్చరించారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్న ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ సైనిక అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, పాత్రికేయ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





