ఉనికి -గిరి ప్రసాద్ చెలమల్లు

చెరువు కట్ట మీద కూర్చుని

చెర్ల నీళ్ళని చూస్తూ సముద్రమని మురిసితిని

చెర్ల చేపలు తారాడుతుంటే

సార్క్ ని చూసిన సంబురం

గట్టు మీది ఈదులను ఒడిసిపట్టి

ముంతలోకి ఒంచిన

కల్లు గుటకేస్తూ మైమరిచితిని

ఈతగెలలు గడ్డివాముల్లో మాగబెట్టి

ఈ నేల ఖర్జూరమని తింటిని

చెరువుమట్టి గడ్డపారతో పెకిలించి

వెదురుతట్టతో తడికల బండి నింపి

కొస పొలంలో  కుప్పలు పోసి

పొలం నిండా చల్లి నేల సారం పెంచి

పైరుకి దన్ను నిచ్చిన సంతృప్తి నాలో

అలుగు పోస్తున్న చెరువు దుంకుతుంటే

ఆ ధారల కింద జలకాలాడుతూ

అదే జలపాతమని తలచితిని

తూముల్ల నీరు గలగల పారుతూ

ఒక్కోమడి తడుపుకుంటూ చివరంటా మళ్ళల్లో

వరి వయ్యారంగా నాట్యం చేయ

సమిష్టి చేతనం ఈ నేలన

చెర్ల బంక మట్టితో బొమ్మలు బండ్లు

సృజనాత్మకతకి తొలి మైలురాయి చోటు

ఆటపాటల విడిది

మా పెచ్చెరువు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *