గ్రామ‌ పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు

– క్షేత్ర‌స్థాయిలో కార్యాచ‌ర‌ణ వేగ‌వంతం 

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9: గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూరే నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే జమ చేసుకుని స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకునేలా ప్రభుత్వం చట్ట సవరణ చేపట్టింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పంచాయతీరాజ్ శాఖ తదుపరి కార్యాచరణను వేగవంతం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12,700 కి పైగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా జాతీయ బ్యాంకులను కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన బ్యాంకులో విధిగా ఒక ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ప్రారంభించాలని జిల్లా పంచాయతీ అధికారులకు సర్క్యులర్ మెమో ద్వారా స్పష్టం చేసింది.ఈ ఖాతాలను ‘ఓఎస్ఆర్–అకౌంట్ – గ్రామ పంచాయతీ పేరు’ పేరుతో ప్రారంభించాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ఇకపై నేరుగా వాటి ఖాతాల్లోనే జమ అయ్యేలా, ఆ నిధులను గ్రామాభివృద్ధి అవసరాలకు వినియోగించుకునేలా ఈ చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ కమిషనర్ జారీ చేసిన మెమో ప్రకారం జిల్లాల వారీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శాఖలను కేటాయించారు. జిల్లా పంచాయతీ అధికారులు తమ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధిత బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఖాతాలను జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లుగా ప్రారంభించాలని, గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరుల (ఓఎస్ఆర్) ద్వారా వచ్చే అన్ని రాబడులు, వాటి నుంచి చేసే ఖర్చుల నిర్వహణకు ప్రత్యేకంగా వినియోగించాలని మెమోలో పేర్కొన్నారు. ఖాతాల నిర్వహణ, సంతకాల అధికారాలు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు.దీంతో గ్రామ పంచాయతీలకు సమకూరే సొంత ఆదాయాన్ని వాటి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా ప్రభుత్వం చేపట్టిన చట్ట సవరణ అమలుకు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభమైంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *