– పలు జిల్లాల్లో వణికిస్తున్న చలి
– 13న బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈనెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ వంటి శివారు ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. సాయంత్రం 5:30 నుంచే చలి గాలుల ప్రభావం తీవ్రమవుతోంది. ఇక ఆదిలా బాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీలకు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కన్నా 2-3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొత్తగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో వర్ష సూచనలు ఉన్నాయి రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడొచ్చని, అనంతరం వాతావరణం పొడిగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీవ్రతను బట్టి వర్షాల ప్రభావంపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ చలి, వర్షాల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




