గ్లోబల్ హెల్త్-టెక్ లీడర్‌గా హైదరాబాద్‌!

తెలంగాణ సమాజం నూతన సాంకేతిక, పారిశ్రామిక విప్లవంలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నది .తెలంగాణ ప్రభుత్వం వైద్య విజ్ఞానం, సాంకేతికతను జోడించి గ్లోబల్ హెల్త్-టెక్ రంగంలో అగ్రభాగాన నిలిచేందుకు నూతన వ్యూహాత్మక విధానాలను అమలు చేయడమే ఇందుకు కారణం. టీ-హబ్ వేదికగా, ఏఐ సిటీ, లైఫ్ సైన్సెస్ రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులు వైద్య పరిశోధనలు, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు బాటలు వేస్తున్నాయి. కేవలం సాఫ్ట్‌వేర్ ఎగుమతులు, సాంప్రదాయ ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ఆధునిక మానవ మేధస్సును మానవాళి జీవన ప్రమాణాలను పెంచే ‘వైద్య విజ్ఞానం’తో ముడిపెట్టే ఒక బృహత్తర ప్రయోగానికి హైదరాబాద్ వేదికైంది. హైదరాబాద్‌లోని టీ-హబ్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించిన వ్యూహాత్మక విధానాలు తెలంగాణను గ్లోబల్ హెల్త్-టెక్  పటంలో అగ్రభాగాన నిలిపేలా ఉన్నాయి. తెలంగాణను గ్లోబల్ హెల్త్-టెక్ హబ్‌గా మార్చే వ్యూహంలో ‘వ్యాధుల ముందస్తు గుర్తింపు’  అత్యంత కీలకమైన అంశం.
మధుమేహం , గుండె జబ్బులు, స్థూలకాయం , ఫ్యాటీ లివర్ వంటి దీర్ఘకాలిక మెటబాలిక్ వ్యాధులు ముదిరిపోకముందే, ప్రాథమిక దశలోనే వాటిని గుర్తించడం ఈ వ్యూహం  ముఖ్య ఉద్దేశ్యం. భారతదేశ మొత్తం ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో దాదాపు 35% నుంచి 40% వాటాతో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్, ప్రపంచ వ్యాక్సిన్ అవసరాలలో మూడో వంతు  ఉత్పత్తిని ఒంటరిగానే అందిస్తూ ‘ఫార్మా క్యాపిటల్’గా వెలుగొందుతున్నది. అయితే, ఇప్పుడు కేవలం మందుల తయారీకే పరిమితం కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డేటా అనలిటిక్స్ సాయంతో నెక్స్ట్-జెన్ వైద్య ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం ఒక విప్లవాత్మక అడుగు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సమన్వయ ఎకోసిస్టం’ ద్వారా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు సరికొత్త స్టార్టప్‌లతో అనుసంధానం కాబోతున్నాయి.
ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో విస్తరిస్తున్న ‘ఏఐ సిటీ’తో పాటు లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రభుత్వం వేగవంతం చేసిన రూ. 20,000 కోట్ల నూతన పెట్టుబడులు రాబోయే కొద్ది కాలంలోనే రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించనున్నాయి. కేవలం పారిశ్రామిక వృద్ధి మాత్రమే కాకుండా, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ-హబ్  ద్వారా ఇప్పటికే వందలాది హెల్త్-టెక్ స్టార్టప్‌లు సరికొత్త ఆవిష్కరణలతో ఇక్కడ రూపుదిద్దుకోవడం గమనార్హం. అమెరికా వెలుపల ప్రపంచంలోని టాప్-10 లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో 9 కంపెనీల రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్  సెంటర్లు హైదరాబాద్‌లోనే ఉండటం మన అంతర్జాతీయ బలానికి నిదర్శనం.
ఈ పారిశ్రామిక, సాంకేతిక వృద్ధి కేవలం కార్పొరేట్ లాభాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు డిజిటల్ వైద్యాన్ని చేరవేయడమే ఈ వ్యూహంలోని అసలైన సార్థకత. ఐసీఎంఆర్  నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్లకు పైగా జనాభా మధుమేహం  మరియు మెటబాలిక్ రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్ ప్లోరర్’ ను ఆవిష్కరించడం అత్యంత సమయోచితమైన చర్య. ప్రభుత్వ హాస్పిటల్ వ్యాధిగ్రస్తులకు ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ ద్వారా ఉచిత ప్రెసిషన్ మెటబాలిక్ కేర్ అందించడం ప్రజా వైద్యంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది.ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక విస్తరణలతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని, నూతన ఆవిష్కరణలను ఏకకాలంలో సమన్వయం చేస్తున్న తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది . టెక్నాలజీని సామాన్యుడి ఆరోగ్య సంరక్షణకు ఆయుధంగా మారుస్తున్న ఈ ప్రయత్నం, గ్లోబల్ హెల్త్-టెక్ విప్లవానికి హైదరాబాద్‌ను శాశ్వత కేరాఫ్ అడ్రస్‌గా మార్చడం ఖాయం.
హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఏఐ సిటీ’ వేదికగా అభివృద్ధి కాబోయే అల్గారిథమ్స్, ప్రజల రోజువారీ జీవనశైలి , ఆహార అలవాట్లు, శారీరక శ్రమ మరియు మెటబాలిక్ పారామితులను విశ్లేషిస్తాయి. కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ, ఒక వ్యక్తికి భవిష్యత్తులో డయాబెటిస్ లేదా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎంత ఉందో ముందే అంచనా వేస్తుంది . ఈ ముందస్తు నిఘా వల్ల రోగులు ముందే అప్రమత్తమై, కేవలం జీవనశైలి మార్పులు, సాధారణ జాగ్రత్తలతోనే పెద్ద జబ్బుల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చు. ఈ ముందస్తు గుర్తింపు విధానం కేవలం ధనికులకు, యాప్‌లు వాడేవారికే పరిమితం కాకుండా సామాన్యులకు సైతం అందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (కింద ప్రభుత్వ దవాఖానాల నుండి ఎంపిక చేసిన 50 మంది రోగులకు ఖచ్చితత్వంతో కూడిన  మెటబాలిక్ కేర్ ప్రోటోకాల్‌ను ఉచితంగా అందించి దీని సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు. ఇది గ్రామీణ , పట్టణ పేద ప్రజల ఆరోగ్య రక్షణలో ఒక మైలురాయిగా నిలవనుంది. వ్యాధులను ముందే గుర్తించి నివారించడం ద్వారా రోగులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై పడే ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈవిధంగా సాంకేతికతను ప్రజా ఆరోగ్యంతో సమర్థవంతంగా అనుసంధానిస్తున్న తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచిగా నిలుస్తుంది. టెక్నాలజీని సామాన్యుడి ఆరోగ్య రక్షణకు ఆయుధంగా మారుస్తున్న ఈ ప్రయత్నం, గ్లోబల్ హెల్త్-టెక్ విప్లవానికి హైదరాబాద్‌ను శాశ్వత కేరాఫ్ అడ్రస్‌గా మార్చడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *