– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
– అలాయ్ బలాయ్ వేదికగా పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : భారత దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా గురువారం జరిగిన ‘అలాయ్ బలాయ్ – 2026 ఉత్సవాల వేదికగా దేశ ప్రగతి, ఐక్యతపై కీలక ప్రసంగం చేశారు. సమాజంలో ఆకలిదప్పులు లేని అభ్యుదయ వాతావరణాన్ని నిర్మించడంతోపాటు అవినీతికి, అఘాయిత్యాలకు ఏమాత్రం తావులేని విధంగా భారత దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలని ల్ణఆకాంక్షించారు. గతంలో భారతీయుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలను, లొసుగులను బ్రిటిష్ పాలకులు తమకు అనుకూలంగా మలుచుకుని దేశాన్ని సుదీర్ఘకాలం పాలించారని గుర్తు చేశారు. ఆ క్రమంలో మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నాటి విభజన రాజకీయాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ప్రస్తుత తరుణంలో ప్రజల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం ఎంతో అవసరమని స్ఫష్టం చేశారు. మనుషుల మధ్య ఉన్న ద్వేషాలను పక్కనబెట్టి ప్రేమను పంచుతూ ఆత్మీయ అనుబంధాలను బలోపేతం చేసే ఒక గొప్ప సామాజిక వేదిక అలాయ్ బలాయ్ అని ఆయన కొనియాడారు. మానవత్వాన్ని మేల్కొలిపి ముందుకు తీసుకెళ్లే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతిని, అనుబంధాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు.
2026 ప్రధాన ఇతివృత్తం ‘నషా ముక్త్ భారత్’
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నాయకత్వంలో అలాయ్ బలాయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 20వ వార్షిక ఉత్సవాల్లో ఈసారి ‘నషా ముక్త్ భారత్’ (వ్యసన రహిత భారతం) అనే ప్రధాన నినాదంతో యువతను చైతన్యపరిచారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాలు, గిరిజన గుస్సాడీ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో పాటు నోరూరించే తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ఈ వేడుకలు అత్యంత కోలాహలంగా సాగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు, ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, వి.హనుమంతరావు, మెదక్ ఎంపీ రఘునందనరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సహా రాజకీయ, సినిమా, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఐక్యత, సోదరభావం 
అలాయ్ బలాయ్ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని, ఇది పూర్తిగా సాంస్కృతిక, సామాజిక వేదిక అని హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. భిన్న రాజకీయ భావజాలాలు, విబేధాలు ఉన్నప్పటికీ నాయకులందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆత్మీయతను చాటుకునేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు కళ్ల లాంటివని, ఇరు రాష్ట్రాల ప్రజలు ప్రాంతీయ భేదాలు మరిచి పరస్పర సహకారంతో కలిసికట్టుగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఉత్సవాల ప్రధాన ఇతివృత్తం ‘నషా ముక్త్ భారత’ (మత్తు రహిత భారతదేశం) గురించి ప్రస్తావించారు. ఉత్సవాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్నారు. ప్రస్తుత సమాజంలో యువత మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు అయిన యువతను కాపాడుకోవడానికి వ్యసనాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. భారత దేశాన్ని 2047 నాటికి ‘వికసిత్ భారత’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చాలనే సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆకలి కేకలు, దప్పులు లేని అభ్యుదయ సమాజాన్ని నిర్మించాలని, అవినీతి, అఘాయిత్యాలకు తావులేని విధంగా భారతదేశాన్ని బలోపేతం చేయాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. బ్రిటిష్ వారు చేసిన విభజన రాజకీయాల నుంచి పాఠాలు నేర్చుకుని మనమంతా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాలన్నారు. గత రెండు దశాబ్దాలుగా అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ గ్రామీణ కళలకు, జానపద నృత్యాలకు, సంప్రదాయ వంటకాలకు ఒక అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





