– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. విజయ దశమి సందర్భంగా హిందూ బంధువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రుడు రావణాసురుడిపై సాధించిన విజయం, దుర్గామాత మహిషాసురుడిని సంహరించిన ఘట్టం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తాయని, అధర్మం ఎంత విర్రవీగినా కష్టపడి పనిచేస్తే చివరకు గెలిచేది ధర్మమే అని దసరా పండుగ మనకు ధైర్యాన్నిస్తుందని వివరించారు. దుర్గా దేవి నవరాత్రులు, బతుకమ్మ పండగ ద్వారా మహిళలను, ప్రకృతిని గౌరవించుకునే గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం మన సనాతన ధర్మానికే సొంతం అని ఆయన అన్నారు. ఈ శుభ సందర్భంలో రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కాలని, కార్మికులు, యువత, మహిళలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, అందరి సహకారంతో, శుభాకాంక్షలతో దేశం అభివృద్ధి పథంలో మరింత వేగంగా పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని, కష్టాలను అధిగమించే ధైర్యాన్ని, కొత్త లక్ష్యాలను సాధించే ఆత్మవిశ్వాసాన్ని ఆ జగన్మాత మనందరికీ ప్రసాదించాలని కోరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరింత శక్తినిచ్చి వికసిత భారత నిర్మాణం కోసం ఆయన చేస్తున్న కృషికి అమ్మవారు సంపూర్ణ ఆశీర్వాదాన్ని అందించాలని ప్రార్థించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ, సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తూ, వికసిత భారత నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దామని ప్రజలకు కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





