– తెలంగాణ సంప్రదాయ వస్త్రాలు, హస్తకళలకు మంచి ఆదరణ
– ఇతర రాష్ట్రాల ఉత్పత్తులకూ భారీ గిరాకీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : హైదరాబాద్‌లో జరుగుతున్న సారస్ మేలా రెండో రోజు కూడా సందడిగా కొనసాగింది. నగరంలోని హెచఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మేలాకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. దీంతో వివిధ రాష్ట్రాల మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ వస్త్రాలు, హస్తకళలు, గ్రామీణ ఉత్పత్తులకు మంచి డిమాండ్ కనిపించింది. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేతలు, ఇకత్ వస్త్రాలు, చెరియాల్ కళాకృతులు, గిరిజన ఆభరణాలు, జూట్, లెదర్ బ్యాగులు, మట్టి వస్తువులు, పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక ఉత్పత్తులను కూడా నగరవాసులు ఆసక్తిగా కొనుగోలు చేశారు. స్టాళ్ల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెర్ప్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా సంఘాల సభ్యులు, కళాకారులకు ఉచితంగా భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తోంది. మేళా ప్రాంగణంలో తాగునీరు, పారిశుధ్యం, ఇతర అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 
రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, జానపద పాటలు తదితర ప్రదర్శనలతో కళాకారులు ప్రేక్షకులను అలరించారు. ప్రత్యేకంగా సెర్ప్ సిబ్బందిలోని పలువురు తమలోని కళా ప్రతిభను ప్రదర్శించడం కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచింది. ఉద్యోగ బాధ్యతలతోపాటు తమలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిబ్బందిని ప్రేక్షకులు అభినందించారు. సారస్ మేళా కేవలం ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలకే పరిమితం కాకుండా గ్రామీణ మహిళలకు నగర మార్కెట్‌ను పరిచయం చేసే వేదికగా నిలుస్తోంది. వినియోగదారుల అభిరుచులు, ఉత్పత్తుల నాణ్యత, ధరలు, ప్యాకేజింగ్‌పై నేరుగా స్పందన తెలుసుకునే అవకాశం మహిళా సంఘాలకు లభిస్తోంది. ఇది భవిష్యత్తులో మరిన్ని మార్కెట్ అవకాశాలు, బల్క్ ఆర్డర్లకు దోహదపడనుంది. మహిళల శ్రమకు మార్కెట్, ప్రతిభకు గుర్తింపు, ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా సారస్ మేళా కొనసాగుతోంది. 18వ తేదీ వరకు జరిగే ఈ మేళాను నగరవాసులు సందర్శించి గ్రామీణ మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





