– సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడు
న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(80) మృతిచెందారు. దిల్లీలోని తీహార్ జైల్‌లో ఉన్న ఆయనను గురువారం సప్దర్‌జంగ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. సజ్జన్ మృతికి గల కారణాలు హాస్పిటల్ వర్గాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1984లో సిక్కు మతస్తులైన తన బాడీ గార్డుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత దిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో సిక్కులపై భారీ స్థాయిలో మూక దాడులు జరిగాయి. ఇందుకు సంబంధించి కొన్ని కేసుల్లో సజ్జన్ కుమార్ దోషిగా తేలారు. ఈ దాడుల్లో సిక్కుల వ్యాపారాలు, నివాస సముదాయాలపై దాడులు జరిగాయి. అనేకమంది చనిపోయారు. పలామ్ కాలనీ ఏరియాలో జరిగిన ఐదుగురి హత్య ఉదంతంలో దిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్‌ను 2018లో దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తరువాత దిల్లీ సారస్వత్ నగర్‌లో ఇద్దరు సిక్కుల హత్య కేసులో దిల్లీ హైకోర్టు 2025లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దిల్లీలోని జనక్‌పురి, వికాస్‌పురి ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల కేసులో మాత్రం సజ్జన్ పాత్రను నిరూపించే ఆధారాలు లేకపోవడంతో కోర్టులో విముక్తి లభించింది. జాట్ వర్గం కీలక నేత సజ్జన్ కుమార్ 1980ల్లో దిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1977లో స్థానిక కౌన్సిలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తరువాత ఔటర్ దిల్లీ నియోజకర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




