– వీర్ భూమి వద్ద నివాళి అర్పించిన సోనియా కుటుంబం
– ఎక్స్ వేదికగా రాజీవ్‌ను స్మరించుకున్న ప్రధాని మోదీ
న్యూదిల్లీ, ఆగస్ట్ 20: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు గురువారం ఘన నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఆయనకు అంజలి ఘటించారు. వారంతా రాజీవ్ గాంధీ స్మారక చిహ్నమైన వీర్ భూమిని సందర్శించి నివాళులర్పించారు. కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆధునిక భారతదేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ కృషి ఎప్పటికీ స్మరించబడుతుందని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ శ్రేణులు నేడు మాజీ ప్రధాని జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మరోవైపు రాజీవ్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ కూడా నివాళులర్పించారు. సద్భావనా దివస్ సందర్భంగా ఆయనను మోదీ స్మరించుకున్నారు. ’భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అంటూ ‘ఎక్స్’ వేదికగా మోదీ పోస్టు చేశారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేడు సద్భావనా దివస్ జరుపుకుంటారు. ఇందులో జాతీయ ఐక్యత, శాంతి, సామరస్యం, యువతపై దృష్టి, లౌకికవాదం వంటి అంశాలు ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం, కుల, మత, జాతి భేదాలకు అతీతంగా సోదరభావాన్ని పెంపొందించడం, ఆధునిక, సమ్మిళిత దేశ నిర్మాణానికి దోహదపడేలా యువతను ప్రేరేపించడం వంటివి రాజీవ్ గాంధీ దార్శనికతలో భాగం. అంతేకాక భిన్నత్వంలో ఏకత్వం అనే దేశ సంప్రదాయాలు, విలువలను నిలబెట్టడానికి ఆయన కృషి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




