– ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ భాగస్వామ్యం
– పశుసంపద అభివృద్ధితోనే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
– సదర్ సమ్మేళనంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : సదర్ ఉత్సవాలు ఏటా మరింత వైభవంగా, దినదినాభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని స్పష్టం చేశారు. సదర్ సమ్మేళనాన్ని ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన అంజన్ కుమార్ యాదవ్‌తోపాటు సదర్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద బుధవారం నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పశు సంపద కీలకమని, పశు సంపదను గౌరవించి, అభివృద్ధి చేసుకున్నప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం సదర్ ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిందని తెలిపారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని వివరించారు. అంజన్ కుమార్ యాదవ్ ప్రజా జీవితాన్ని ప్రస్తావిస్తూ యువజన కాంగ్రెస్ నాయకుడిగా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించారని కొనియాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ప్రజలతో మమేకమై పనిచేశారని ప్రశంసించారు. సదర్ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతోపాటు పశుసంపద అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో పశు సంపదను పెంపొందించేందుకు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. సదర్ ఉత్సవాల్లో పాల్గొంటున్న కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఈ కార్యక్రమాలు దోహదపడాలని ఆకాంక్షించారు. భారతీయ చరిత్రలోనూ పశు సంపదకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెబుతూ మహాభారతంలోని గోగ్రహణ ఘట్టాన్ని ప్రస్తావించారు. వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు మూలమని, వ్యవసాయాన్ని బలోపేతం చేసే పశు సంపదను పరిరక్షించి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. సదర్ ఉత్సవాలు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని, వాటి ప్రాధాన్యతను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





