– బేతుపల్లిలో ఘటన
– జాలర్లను కాపాడేందుకు వెళ్లగా పడవల బోల్తా
– ఘటనపై ముఖ్యమంత్రి, మంత్రి పొంగులేటి ఆరా
సత్తుపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 4 : జాలర్లను కాపాడేందుకు వెళ్లి 11 మంది ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిలో చోటుచేసుకుంది. భారీ వర్షాలకు బేతుపల్లి పెద్ద చెరువు అలుగు పారుతుండడంతో చేపలు బయటకు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేసేందుకు ఐదుగురు జాలర్లు వెళ్లి వరదలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు తొలుత ముగ్గురు ఫైర్ సిబ్బంది బోటులో వెళ్లగా అది మొరాయించడంతో చెరువు నీటిలో చిక్కుకుపోయారు. దీంతో కొత్తగూడెం ఎస్డీఆర్ఎఫ్కు చెందిన ఆరుగురు, మరో నలుగురు ఫైర్ సిబ్బంది, ఇద్దరు గైడ్లు రెండు బోట్లలో వారిని కాపాడేందుకు వెళ్లారు. తొలుత బోటులో చిక్కుకుపోయిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చారు. అనంతరం మత్సకారులను తీసుకొచ్చేందుకు వెళ్లగా రెండు బోట్లు పల్టీలు కొట్టి అందులోని 11మంది గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ దివాకర టీఎస్, ఎమ్మెల్యే మట్టా రాగమయి అక్కడికి వెళ్లి సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించి బోటు సహాయంతో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేపట్టారు. డ్రోన్‌తో లైఫ్ జాకెట్లు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బేతుపల్లి చెరువులో ఎస్డీఆర్ఎఫ్ బోట్ల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సీఎం సూచించారు. మరోవైపు చెరువులో చిక్కుకుపోయిన జాలర్లు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
బేతుపల్లి ఘటనపై మంత్రి పొంగులేటి పర్యవేక్షణ
కలెక్టర్, పోలీసు కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా
బేతుపల్లి ఘటనపై మంత్రి పొంగులేటి పర్యవేక్షణ
కలెక్టర్, పోలీసు కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా
హైదరాబాద్: బేతుపల్లి చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఆరఎఫ్ సిబ్బంది పరిస్థితిపై రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మురసు తుపాను ప్రభావంతో బేతుపల్లి చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆరఎఫ్ బృందం బోటు తిరగబడిన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, పోలీస్ కమిషనర్ సునీల్దత్తోపాటు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమీప ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించాయి. వారిని మరో గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సహాయక చర్యల పురోగతిని జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడి సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు గురువారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు.
————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





