– తెరపైకి ఊహించని అభ్యర్థి
– రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
– కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రకటనలు, కొత్త రాజకీయ సమీకరణలు ఎన్నికల పోటీని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడు, హైకోర్టు న్యాయవాది డాక్టర్ నలమాస కృష్ణ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమరెడ్డిని ప్రకటించగా, బీఆర్ఎస్ పార్టీ తరఫున రాకేష్ రెడ్డి బరిలో నిలిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరొకవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పాలకూర అశోక్ గౌడ్‌ను తీన్మార్ మల్లన్న ప్రకటించగా, కలవకుంట్ల కవిత నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు రంగంలో ఉండగా, నలమాస కృష్ణ అభ్యర్థిత్వంపై జరుగుతున్న ప్రచారం ఎన్నికల రాజకీయంలో కొత్త చర్చకు తెరలేపింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, విద్యార్థి-యువజన సంఘాలతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, మేధావులతో ఉన్న పరిచయాలు నలమాస కృష్ణకు రాజకీయంగా కలసివచ్చే అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా పోటీ ఇవ్వగల ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఆయనను కొందరు మేధావులు, ప్రజాస్వామికవాదులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో గద్దర్, వరవరరావు, పాశం యాదగిరి, ప్రొఫెసర్ హరగోపాల్, కేశవరావు జాదవ్, విమలక్క, ప్రొఫెసర్ కోదండరాం, అల్లం నారాయణ, కొండా లక్ష్మణ్ బాపూజీ, బూర్గుల రామారావు, బాలగోపాల్ తదితర ఉద్యమ ప్రముఖులతో కలిసి వివిధ ప్రజాసంఘాలు, ఐక్య కార్యాచరణ వేదికల కార్యకలాపాల్లో నలమాస కృష్ణ క్రియాశీలంగా పాల్గొన్నారు.
తెలంగాణ ఐక్య కార్యాచరణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వంటి వేదికల ద్వారా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విద్యార్థి, యువ జన సంఘాలతో సన్నిహితంగా పనిచేస్తూ, ఉద్యమ సమయంలో ఆయా వర్గాలకు మార్గనిర్దేశం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమంలో భాగంగా ఆయనపై పలు కేసులు నమోదవడమే కాకుండా, జైలు జీవితం గడపడం, యూఏపీఏ, ఎన్ఎస్ఏ వంటి చట్టాల కింద కూడా కేసులు ఎదుర్కొన్నట్లు ఆయన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అనుభవాలు ఉద్యమకారులు, ప్రజాసంఘాల వర్గాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నెట్‌వర్క్‌తో ఉన్న పరిచయాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సామాజిక అవగాహన, ఉద్యమ నేపథ్యం, వివిధ వర్గాలతో సంబంధాలు ఆయనకు బలంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, నలమాస కృష్ణ అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యమ సంస్థలు, మేధావులు, ప్రజాస్వామికవాదులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వామపక్ష శ్రేణులతో ఆయనకు ఉన్న పాత ఉద్యమ అనుబంధం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చనే చర్చ సాగుతోంది. సీపీఐ కాంగ్రెస్‌తో రాజకీయ పొత్తులో ఉన్నప్పటికీ, సీపీఎం తన అభ్యర్థిని ప్రకటించినప్పటికీ, వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న కొందరు పట్టభద్రులు నలమాస కృష్ణ వైపు మొగ్గుచూపే అవకాశముందని ఆయన మద్దతుదారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల సామాజిక నేపథ్యం, ఇతర అభ్యర్థుల మధ్య ఓట్ల విభజన వంటి అంశాలు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు నలమాస కృష్ణకు అనుకూలంగా మారతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 6న అమరవీరుల స్థూపం వద్ద ప్రముఖులు, ఉద్యమకారులు, మేధావుల సమక్షంలో నలమాస కృష్ణ తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకున్నట్లే. ఇప్పటివరకు ప్రధాన పార్టీల మధ్య పోటీగా కనిపిస్తున్న ఎన్నికల్లో నలమాస ప్రవేశం ఎలాంటి కొత్త సమీకరణాలకు దారీతీస్తుంది.. ఆయన అభ్యర్థిత్వం ఎవరికి రాజకీయంగా సవాళ్లుగా మారుతుంది.. ఉద్యమ నేపథ్యం, మేధావుల మద్దతు, పట్టభద్రుల ఆదరణ ఆయనకు ఎంతవరకు బలమవుతాయి అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





