30 ‌నెలల్లో రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగవేత

– సభల పేరుతో నాటకాలు
– రైతులకు చేసిందేమీ లేదు
– మరోమారు రేవంత్‌పై కేటీఆర్‌ ‌విమర్శలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 30: కాంగ్రెస్‌ ముప్పై నెలల పాలనలో రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొటారని, పైగా సభల పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ ‌శిల్పకళా పైనుంచి సీఎం రేవంత్‌ ‌రైతు భరోసా నిధులను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ‘ఎక్స్’ ‌వేదికగా కేటీఆర్‌ ‌విరుచుకుపడ్డారు. 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమేకాక మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా రేవంత్‌రెడ్డీ అని ప్ర‌శ్నించారు. గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా? కేవలం ఒక్క బటన్‌ ‌నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే నీ పీఆర్‌ ‌స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం అవివేకమేనంటూ ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీ చేసి చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కు నేలకు రాయాలని హిత‌వు ప‌లికారు. అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయమన్నారు. ‘ఇప్పటికే రూ.50 వేల కోట్లతో చేయాల్సిన రూ.2 లక్షల రుణ మాఫీని చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశావు.. 72 సార్లు నీ దిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్‌ ‌మీటింగ్‌లకు పెడుతున్న రూ.కోట్ల ఖర్చును ఆదా చేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేది’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్‌ ‌డైవర్షన్‌ ‌చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకోవాల‌న్నారు. కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారని తెలిపారు. కేసీఆర్‌ ‌ఠంచన్‌గా 11 సార్లు, రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి తమకు వెన్నుపోటు పొడుస్తున్న దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదని హెచ్చ‌రించారు. రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్‌ ‌నిలిస్తే మీరు ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని గుర్తుపెట్టుకోండి అంటూ కేటీఆర్‌ ‌విమ‌ర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *