– హైదరాబాద్ నుంచే ప్రపంచ విమానయాన భవిష్యత్తుకు దిశానిర్దేశం
– ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ప్రపంచ ఆకాశంలో ఎగురుతోంది
– రాష్ట్ర అంతర్జాతీయ ప్రాధాన్యతను పెంచిన ఏరోమార్ట్
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలవబోతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఏరోమార్ట్ హైదరాబాద్-2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది.. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా అని స్పష్టం చేశారు. భారత వైమానిక దళంలో పైలట్‌గా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో ప్రత్యక్ష అనుభవం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు, ఎంఆర్‌వో వ్యవస్థలు నేడు తెలంగాణలోనే తయారవుతున్నాయని తెలిపారు. మేడ్ ఇన్ తెలంగాణ అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతోంది అని పేర్కొన్నారు. స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఏరో, కెనడాకు చెందిన ఎఫ్‌టీజీ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఫ్రాన్స్, ఇటలీ సహా 25కిపైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్‌లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచిందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 1,500కుపైగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్‌ఎంఈలు పనిచేస్తున్నాయని, పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు. డీఆర్‌డీవో, రక్షణరంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రైవేట్ పరిశ్రమలు ఒకే నగరంలో ఉండటం హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి పోటీ సామర్థ్యాన్ని కల్పించాయన్నారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మారుతున్న ఐటీఐలు ప్రపంచస్థాయి ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం కొన్నేళ్లుగా 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా గత ఏడాది ఎగుమతులు 103 శాశానికి పెరిగి రాష్ట్రానికి అగ్రగామిగా ఉన్న ఔషధ రంగాన్నే అధిగమించడం రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగ విస్తరణకు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన, ఆదిలాబాద్‌లో పౌర-సైనిక అవసరాలకు అనువైన ఎయిర్‌ఫీల్డ్, కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో ఆమోదం లభించనున్నాయని తెలిపారు. ఈ మూడూ భవిష్యత్తులో విమాన మరమ్మతు, విమాన తయారీ, రక్షణ పరిశ్రమలకు భారీ అవకాశాలను తెరవనున్నాయన్నారు. ప్రపంచ ఏరోస్పేస్ దిగ్గజాలను ఉద్దేశించి మాట్లాడుతూ మీ తదుపరి తయారీ కేంద్రం తెలంగాణ కావాలి.. మీ తదుపరి పెట్టుబడి హైదరాబాద్‌లో ఉండాలి అన్నారు. ‘ఏరోమార్ట్ హైదరాబాద్-2026 ఒక పారిశ్రామిక సదస్సు మాత్రమే కాదు.. ప్రపంచ ఏరోస్పేస్ పటంలో తెలంగాణ శాశ్వత స్థానాన్ని ఖరారు చేసే చారిత్రక వేదిక’ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





