తెలంగాణపై బీజేపీకి కక్ష

– ఎరువుల సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరాలను తగ్గించి ఇబ్బందులు సృష్టిస్తోందని బీసీ, ర‌వాణా శాఖ‌ల‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఎరువుల సరఫరా బీజేపీ బాధ్యత అని అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులను సకాలంలో విడుదల చేయడంలో ఇద్దరు కేంద్ర మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ ‌పట్టణంలో మంత్రి ప్రభాకర్‌ ‌మంగ‌ళ‌వారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 17, 18 వార్డుల్లో కొనసాగుతున్న ఓటర్‌ ‌సవరణ పక్రియను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎరువుల తయారీ, సరఫరా కేంద్రం పరిధిలోని అంశమన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఎరువులు తయారు చేసుకోరని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తయారు చేసే ఎరువులతోపాటు తెలంగాణలో ఉన్న ఎరువుల ఫ్యాక్టరీని రాష్టాన్రికి అప్పగించాలని మంత్రి డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరత విషయంలో బీజేపీ రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అభివృద్ది గిట్టని బీజేపీ, బీఆర్‌ఎస్‌నేతలు అదేపనిగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేసే మంచి పనులను జీర్ణించుకోలేక భవిష్యత్తులో అధికారం దక్కదనే ఆవేశం, ఆక్రోశంతో కేటీఆర్‌,‌ హరీష్‌ ‌రావులు  మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎవరిపైనా కక్షపూరిత చర్యలు తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు.. తప్పు చేసిన వాళ్లను జైలులో వేస్తేనే శిక్షించినట్లు కాదు అన్నారు. ప్రతి ఎన్నికల్లో వాళ్లను ఓడించి ప్రజలు శిక్షిస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని మంత్రి ఎద్దేవా చేశారు. ఆశ ఉండడంలో తప్పులేదని, కానీ ఆ పార్టీ అత్యాశకు పోతోందని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకే తాను ముక్కలని విమర్శించారు. కాళేశ్వరం అవినీతి, థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్ల అక్రమాలపై సీబీఐ విచారణ కోరితే కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

వరంగల్‌ అభివృద్ధిపై చర్చకు సిద్దమా

వరంగల్‌ అభివృద్ధి గురించి మాట్లాడే ముందు బీజేపీ నాయకులు ప్రజలకు నిజాలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సవాల్‌ ‌చేశారు. కొత్తగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడు తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘వరంగల్‌ ఎయిర్‌పోర్టును మంజూరు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానిదే.. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని ఇప్పటికే ఇచ్చింది.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎయిర్‌పోర్టు పక్రియ వేగం పుంజుకుంది.. పదేళ్లు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాల’ని మంత్రి డిమాండ్‌ ‌చేశారు. అర్బన్‌ ‌ఛాలెంజ్‌ ‌ఫండ్‌ ‌ద్వారా పట్టణాల అభివృద్ధికి త‌మ‌ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందన్నారు. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో సుమారు రూ.5 వేల కోట్లతో అండర్‌‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ పనులను  ప్రారంభించాం.. హైదరాబాద్‌ ‌తర్వాత వరంగల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం.. స్మార్ట్ ‌సిటీ నిధులపై ఆరోపణలు చేసే బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి. నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా సమాధానం ఇవ్వాలన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందన్నారు. కార్పొరేషన్‌లో మెజారిటీ లేకుండా మేయర్‌ అవుతామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. ఎరువుల సరఫరా విషయంలో కూడా బీజేపీ వాస్తవాలను వక్రీకరిస్తోం విమ‌ర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి రూ.10లో తిరిగి కేవలం రూ.3 వస్తున్నాయి. మిగిలిన నిధుల గురించి కేంద్రం సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు ఢిల్లీ వెళ్లినా రాష్టాన్రికి రావాల్సిన నిధులపై స్పందన లేదన్నారు. వరంగల్‌ అభివృద్ధిపై కేంద్ర మంత్రులు బండి సంజయ్‌,  కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరైనా బహిరంగ చర్చకు రావచ్చు. తెలంగాణకు బీజేపీ చేసిన మేలు ఏమిటో, వరంగల్‌ అభివృద్ధికి వారు చేసిన కృషి ఏమిటో ప్రజల ముందే చర్చిద్దాం అని మంత్రి స‌వాల్ విసిరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *