– 40 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి పూర్వ విద్యార్థులు
హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : వరంగల్ కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) క్యాంపస్‌లో 1982-86 మూడో బ్యాచ్ పూర్వ విద్యార్థుల ‘రూబీ రీయూనియన్’ (40 ఏళ్ల కలయిక) వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. కిట్స్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తమ కళాశాల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యనందించిన సీనియర్ ప్రొఫెసర్లను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, ప్రత్యేక అతిథిగా బిట్స్ పిలానీ గ్రూప్ వీసీ ప్రొఫెసర్ వి.రామగోపాల్ రావు (1986 బ్యాచ్ పూర్వ విద్యార్థి, ఐఐఐటీ దిల్లీ మాజీ డైరెక్టర్) హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డితో కలిసి వారు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. 
ఎండోమెంట్ ఫండ్ ఏర్పాటు అభినందనీయం: ప్రొఫెసర్ రామగోపాల్ రావు
ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామగోపాల్ రావు మాట్లాడుతూ విద్యాసంస్థల అభివృద్ధిలో బలమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నిరుపేద విద్యార్థుల చదువుల ప్రయోజనం కోసం ఈ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ‘ఎండోమెంట్ ఫండ్’ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. సాంకేతిక రంగానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యం, సామాజిక బాధ్యతలతో కిట్స్ వారసత్వాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
తాజా ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి: కెప్టెన్ లక్ష్మీకాంత రావు
కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలకు, వర్ధమాన పోకడలకు అనుగుణంగా విద్యాసంస్థలు, విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, బలమైన స్నేహబంధాలను నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు.
పూర్వ విద్యార్థుల మద్దతు మరువలేనిది: ప్రిన్సిపాల్ అశోక రెడ్డి
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో, ప్రయోగశాలలకు అత్యాధునిక పరికరాలు సమకూర్చడంలో, వర్క్‌షాప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు మరియు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ శిక్షణా కార్యక్రమాలు అందించడంలో పూర్వ విద్యార్థులు నిరంతరం మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో కిట్స్ కోశాధికారి పి.నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు కె.దేవిప్రసాద్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ గంధం వెంకటయ్య నాయుడు, అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తలు వెంకటేష్, వెంకటకృష్ణ, సివిల్ విభాగపు హెచ్‌ఓడీ డాక్టర్ ఎం. శ్రీకాంత్, ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ ఓ.ఆంజనేయులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, పరిపాలనా అధికారి ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, పీఆర్‌ఓ డాక్టర్ డి.ప్రభాకరా చారి, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన 120 మందికి పైగా పూర్వ విద్యార్థులు, విశ్రాంత అధ్యాపకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





