రేపు కోదాడలో మెగా జాబ్ మేళా

– 300కు పైగా కంపెనీలు.. 3,500కు మించిన ఉద్యోగావకాశాలు
– మంత్రి ఉత్తమ్‌కుమార్ చొరవతో

కోదాడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కోదాడలో మెగా జాబ్ మేళా శనివారం నిర్వహించనున్నారు. ఈ మేళాలో 300కు పైగా కంపెనీలు పాల్గొని 3,500కు మించిన ఉద్యోగాలను కల్పించేందుకు నియామక ప్రక్రియ చేపట్టనున్నాయి. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి సమన్వయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ మేళా నిర్వహణకు సహకరిస్తున్నాయి. కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆహ్వానించారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొననున్నది. కంపెనీల ప్రతినిధులతో నేరుగా మాట్లాడడంతోపాటు ఒకేచోట ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం వారికి లభించనుంది. కంపెనీలనే యువతకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కోదాడలో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. 2025 అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 200కు పైగా కంపెనీలు పాల్గొనగా సుమారు 900మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆ మేళా విజయాన్ని కొనసాగిస్తూ ఈసారి మరింత భారీ స్థాయిలో కోదాడలో నియామక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాన్ని పొందేందుకు కోదాడలో జరిగే మెగా జాబ్ మేళాకు యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *