హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడమే కాక ఒక పార్టీపై గెలిచి మరో పార్టీ తరఫున నామినేషన్ వేసిన నాటినుంచే ఆ అనర్హత వర్తిస్తుందని పేర్కొనడం, స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టడం అత్యంత కీలక పరిణామమని పేర్కొన్నారు. ఈ విజయం నైతికంగా, చట్టపరంగా రాజ్యాంగానికి లభించిన తిరుగులేని గెలుపని కొనియాడారు. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని నీతులు చెప్పే రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) మార్గదర్శకాలను స్వయంగా విస్మరించడం హాస్యాస్పదమని విమర్శించారు. గతంలో బీఆరఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తాజా తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ అనైతిక విధానాలకు చెంపపెట్టు అని, నైతికంగా, చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయిందని స్పష్టం చేశారు. అంతేకాక స్పీకర్ నిర్ణయం తప్పని న్యాయస్థానంలో తేలిపోయిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై నిజమైన గౌరవం ఉంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. వారు ఏ పార్టీలో చేరారో అదే పార్టీ గుర్తుపై మళ్లీ పోటీ చేసి ప్రజాక్షేత్రంలో ప్రజాతీర్పును పొంది గెలవడమే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి అని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడే దిశగా వెలువడిన ఈ తీర్పు ప్రజాస్వామ్యానికే గర్వకారణమని ఆయన పునరుద్ఘాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *