సేతుబంధన్, ఆర్వోబీ పనుల్లో వేగం పెంచాలి

– నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభం కావాలి
– సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి
– ఆర్ అండ్ బి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రాష్ట్రవ్యాప్తంగా సీఆర్‌ఐఎఫ్ ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు, పురోగతిలో ఉన్న పలు ఆర్వోబీ పనుల్లో వేగం పెంచాలని, సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు. సెక్రటేరియట్‌లో రోడ్లు భవనాలు శాఖపై శనివారం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేస్తున్న షిడెడ్ పార్కింగ్ (సోలార్ కార్ పార్కింగ్) పనుల పురోగతిపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. సెక్రటేరియట్‌కు ఉత్తర భాగంలో చేపట్టిన పనుల పురోగతిని మంత్రికి ఇంజినీర్లు వివరించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు సచివాలయ భవనం మూడు వైపులా(ఉత్తరం, పడమర, దక్షిణం) ఎలివేషన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్డింగ్ స్ట్రక్చర్ వరకే సోలార్ పార్కింగ్ ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సచివాలయ ఉత్తర భాగంలో రెండు వరుసల్లో, దక్షిణ భాగంలో మూడు వరుసల్లో, పడమర భాగంలో ఒక్క వరుసలో సోలార్ ప్యానెల్స్‌తో కూడిన కార్ పార్కింగ్ డిజైన్లు ఉండేలా చూడాలన్నారు. సంబంధిత డిజైన్లు అధికారులు మంత్రికి చూపారు. సోలార్ కార్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే సెక్రటేరియట్‌పై 90వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, నెలవారీ విద్యుత్ బిల్లులో 16% ఆదా అవుతుందని మంత్రి పేర్కొన్నారు. సీఆర్‌ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, ఆర్వోబీ పనుల్లో వేగం పెంచాలని, ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారీగా జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ ఇంకా మెరుగవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు 3,918 కి.మీ రోడ్లు, రూ.5159 కోట్లతో 316 పనులు మంజూరు చేశామని, అందులో కొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, చాలావరకు పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. 2025-26కు సంబంధించి రూ.868 కోట్లతో చేపట్టిన 422.36 కి.మీ రోడ్ల పనుల పురోగతి సంతృప్తికరంగా ఉన్నదని అధికారులను మంత్రి ప్రశంసించారు. పలు హై లెవెల్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు నిర్ణీత సమయానికి పూర్తవ్వాలని సూచించారు. సేతుబంధన్ పథకం ద్వారా రూ.76 కోట్లతో చేపట్టిన నార్కట్‌పల్లి బ్రిడ్జి పనుల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. మిర్యాలగూడ, నందిపహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని, దానికి సంబంధించిన సాంకేతిక అంశాలు తక్షణం పూర్తి చేయాలని, స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సి.ఈ వనజను ఆదేశించారు. కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వికారాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్, రంగారెడ్డి పనుల పురోగతిపై అధికారులు మంత్రికి వివరించారు. అధికారులు ఇంకా కష్టపడి పనిచేయాలని, మెరుగైన రోడ్లు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యంలో అత్యంత కీలకంగా వ్యవహరించాలని మంత్రి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. సమీక్షలో ఈఎన్సీ(అడ్మిన్) లింగారెడ్డి, సీఈలు వసంత్ నాయక్, వనజ, ధర్మారెడ్డి, డీసీఈ అహ్మద్ అబ్దుల్ అలీ, ఈఈ రూప్‌కరణ్, డీఈ రూపారాణి, ఏఈఈ గంగాధర్, పలువురు ఆర్ అండ్ బి ఇంజనీర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *