– ఎగువన వర్షాలతో కొనసాగుతున్న ప్రవాహం
శ్రీశైలం, ఆగస్ట్ 4: శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం 92.048 టీఎంసీల నీరుంది. మంగళవారం సాయంత్రానికి వంద టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం జూరాల ప్రాజెక్టు నుంచి 2.21 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేశారు. రాత్రి సమయానికి శ్రీశైలానికి 1.55 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరింది. రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహ ఉధృతి మరో నాలుగైదు రోజులు కొనసాగవచ్చని శ్రీశైలం డ్యాం సీఈ కబీర్ బాషా తెలిపారు. ఎగువన కర్ణాటకలో ఆలమట్టికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.50 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్‌కు 1,28,954 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 1,40,880 క్యూసెక్కులు వదిలారు. వీటికి భీమా నది వరద జలాలు కలుస్తున్నాయి. దీంతో జూరాలకు మొత్తం 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎగువ నుంచి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని 2,21,765 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలోకి సోమవారం 57,785 క్యూసెక్కుల ఇన్‌ప్లో ఉంది. తాగునీటి అవసరాల కోసం వివిధ కాలువలకు 1390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 136 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వస్తున్నాయి. పులిచింతలలో సోమవారం 28.91 టీఎంసీల నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి 6958 క్యూసెక్కులు వస్తుంటే.. 6499 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
నిండుకుండలా పోచారం ప్రాజెక్ట్
నిజామాబాద్ : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రానికి 1.575 టీఎంసీ ఉండినది. సోమవారం సాయంత్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి వరద పెద్ద ఎత్తున చేరడం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లడం ప్రారంభించింది. ప్రాజెక్టు సామర్థ్యం 1820 టీఎంసీ ఉండగా మంగళవారం ఉదయం నాటికి పూర్తి స్థాయిలో నిండుతోంది. ఎగువ ప్రాంతాల నుండి 8,292 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి రావడంతో ప్రాజెక్టు భారీగా పొంగిపొర్లుతోంది. నాగిరెడ్డిపేట్ మండలానికి పెద్ద దిక్కుగా ఉన్న పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుండడంతో నాగిరెడ్డిపేట్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వానాకాలం పంటలకు ఢోకా లేదని అంటున్నారు.
చురుకుగా నైరుతి కదలికలు : ఎల్లో హెచ్చరిక జారీ
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురసే అవకాశముందని వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో సోమవారంఉత్తర తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. కామారెడ్డిలో అత్యధికంగా 18.2 సెం.టర్లు, వికారాబాద్, సంగారెడ్డిలో భారీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





