తెలంగాణ రాష్ట్రం సాంకేతిక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, అదే సమయంలో నేరాల పెరుగుదల విషయంలో కూడా ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2024 లో తెలంగాణ లో సైబర్ నేరాల రేటు ప్రతి లక్ష జనాభాకు 71.1 కేసులుగా నమోదై దేశంలోనే అత్యధికంగా నిలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దేశ సగటు 7.3 కేసులతో పోలిస్తే ఇది దాదాపు పది రెట్లు ఎక్కువ. ఒకవైపు డిజిటల్ మోసాలు, ఆన్‌లైన్ దందాలు ప్రజలను వణికిస్తుండగా, మరోవైపు హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంటున్న హత్యలు, దోపిడీలు, మహిళలపై దాడులు నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
శుక్రవారం ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య, మరో యువకుడి హత్య వార్తలు నగర ప్రజలను కలవరపరిచాయి. ఒకప్పుడు “సురక్షిత నగరం”గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం కేవలం యాదృచ్ఛికం కాదు.నగరం నడిబొడ్డున, భద్రత పటిష్టంగా ఉంటుందని భావించే ప్రాంతాల్లోనే దారుణాలు జరుగుతున్నాయి. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను ఆమె ఇంట్లోనే హత్య చేయడం శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్ట. ఉన్నతాధికారుల కుటుంబాలకే రక్షణ లేకపోతే, సామాన్యుడి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. గత వారం కరీంనగర్ లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నివాసం సమీపంలో నగల దుకాణంలో మధ్యాహ్నం సమయంలో అయిదుగు దుండగులు బంగారం చోరీ కి పాల్పడడం భద్రతా లోపాల పై చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు, భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెరుగుతున్న జనాభా—అన్నీ కలిసి నగర జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. కానీ అభివృద్ధి వేగానికి తగ్గట్టుగా సామాజిక భద్రతా వ్యవస్థలు బలోపేతం కాలేకపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాలు, షీ టీమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు వంటి ఆధునిక వ్యవస్థలు ఉన్నప్పటికీ, నేరాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగించే అంశం.
సైబర్ నేరాల విషయంలో తెలంగాణ పరిస్థితి మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. పెట్టుబడులు, ఐటీ రంగం, డిజిటల్ లావాదేవీలు అధికంగా ఉండే రాష్ట్రం కావడంతో మోసగాళ్లు తెలంగాణ ప్రజలను ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, కృత్రిమ మేధస్సుతో తయారైన వీడియోలు, బ్యాంకింగ్ మోసాలు, ఉద్యోగాల పేరిట మోసాలు, పెట్టుబడుల పేరుతో దందాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేసులు పెరుగుతున్నప్పటికీ వాటి విచారణ, చార్జిషీట్లు, శిక్షల విషయంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. కేసులు నమోదు కావడం ఒక వైపు అయితే, నేరస్తులు శిక్ష పడకపోతే ప్రజల్లో చట్టంపై విశ్వాసం దెబ్బతింటుంది.
ఇటీవల నగరంలో చోటుచేసుకుంటున్న హత్యలు కూడా సామాజిక అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయి. చిన్న చిన్న వివాదాలు ప్రాణాలు తీసే స్థాయికి చేరడం, కుటుంబ కలహాలు హత్యలకు దారితీయడం, యువతలో హింసాత్మక ధోరణి పెరగడం ఇవి కేవలం పోలీసింగ్ సమస్యలు మాత్రమే కావు. ఇవి సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఒంటరితనం, విలువల సంక్షోభానికి సంకేతాలు.ముఖ్యంగా యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం కూడా నేరాలకు కారణమవుతోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా పట్టు పెరుగుతోందన్న అనుమానాలు చాలాకాలంగా వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, యువ ఉద్యోగులు, పార్టీల సంస్కృతి—ఇవి కొంతమందిని మత్తు అలవాట్ల వైపు నెడుతున్నాయి. మత్తు ప్రభావంలో జరిగే దాడులు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ హింస ఘటనలు పెరుగుతున్నాయనే ఆందోళనలు ఉన్నాయి.
మరో ముఖ్యమైన అంశం పోలీసింగ్‌పై పెరుగుతున్న ఒత్తిడి. నగర జనాభా పెరుగుతున్నా, పోలీసు బలగాల సంఖ్య, సిబ్బంది పనిభారం, మానసిక ఒత్తిడి వంటి అంశాలు పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, భౌతిక స్థాయిలో ప్రజలతో మమేకమయ్యే కమ్యూనిటీ పోలీసింగ్ బలహీనపడితే నేరాల నియంత్రణ కష్టమవుతుంది. ప్రతి కాలనీలో, ప్రతి అపార్ట్‌మెంట్‌లో భద్రతపై అవగాహన పెరగాలి. అనుమానాస్పద కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతం నగర జీవితం ఒక విరుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలనే లక్ష్యం, మరోవైపు భద్రతపై పెరుగుతున్న భయాలు. మహిళలు రాత్రివేళ బయటకు వెళ్లడానికి భయపడే పరిస్థితి రావడం, వృద్ధులు ఒంటరిగా నివసించడానికి అసౌకర్యంగా భావించడం, యువతపై దాడులు పెరగడం.. ఇవి ఆరోగ్యకర సమాజ లక్షణాలు కావు.
ప్రభుత్వం కేవలం ఘటనల తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలి. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక కోర్టులు, వేగవంతమైన విచారణ వ్యవస్థలు అవసరం. పాఠశాలలు, కళాశాలల్లో డిజిటల్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మానసిక ఆరోగ్య సేవలను విస్తరించాలి. యువతలో పెరుగుతున్న నిరాశ, ఆందోళన, ఒంటరితనాన్ని తగ్గించే సామాజిక వేదికలు అవసరం.
అదే విధంగా నగర అభివృద్ధి కేవలం భవనాలు, ఫ్లైఓవర్లు, ఐటీ టవర్ లతో కొలవలేము. ఒక నగరం నిజంగా అభివృద్ధి చెందిందని చెప్పాలంటే అక్కడి ప్రజలు భద్రంగా జీవించగలగాలి. ఒక వృద్ధ మహిళ తన ఇంట్లో సురక్షితంగా ఉండగలగాలి. ఒక మహిళ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో భయపడకూడదు. ప్రజలలో భద్రతా భావన పెరగకపోతే ఏ అభివృద్ధికైనా అర్థం ఉండదు. తెలంగాణ సైబర్ నేరాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలవడం ఒక హెచ్చరిక. హైదరాబాద్‌లో పెరుగుతున్న హత్యలు,.. ఇతర నగరాల్లో జరుగుతున్న దొంగతనాలు సాధారణ ఘటనలు కావు, సమాజానికి ప్రమాద సంకేతాలు. ఈ పరిస్థితిని కేవలం పోలీసు సమస్యగా కాకుండా, సామాజిక-ఆర్థిక-మానసిక సంక్షోభంగా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, కుటుంబాలు, విద్యాసంస్థలు, పౌర సమాజం సమిష్టిగా పనిచేసినప్పుడే ఈ పెరుగుతున్న నేరాలను తగ్గించగలం.





