గ్రామీణ మహిళలు, మధ్యతరగతి కుటుంబాల మహిళలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల్లో కమలం పార్టీకి మద్దతు పెరిగినట్లు ఫలితాల ధోరణి సూచిస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఈరోజు డబ్బు, మీడియా ప్రభావం, కుటుంబ వారసత్వం ఆధిపత్యం పెరుగుతున్న సమయంలో, పెద్ద ఆర్థిక బలం లేని మహిళలకు బీ-ఫారాలు ఇవ్వడం, వారిని గెలిపించడం ద్వారా బీజేపీ ఒక కొత్త రాజకీయ ప్రయోగం చేసినట్లు కనిపిస్తోంది.
సామాజిక సమీకరణాల కొత్త నమూనా!
– డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, మాజీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్
పశ్చిమ బెంగాల్ తాజా ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపాయి. ఒకప్పుడు వామపక్ష భావజాలానికి ప్రతీకగా నిలిచిన బెంగాల్‌లో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కేవలం ఎన్నికల గెలుపు మాత్రమే కాదు.. అది దేశ రాజకీయాల్లో మారుతున్న సామాజిక వాస్తవాలకు సంకేతంగా కనిపిస్తోంది. చాలా కాలంగా ప్రాంతీయ రాజకీయాల ప్రభావంలో ఉన్న రాష్ట్రంలో, జాతీయ రాజకీయ శక్తిగా బీజేపీ ప్రజల్లో బలమైన స్థానం సంపాదించడం విశేషంగా మారింది. ఈ విజయాన్ని కేవలం అధికార మార్పుగా మాత్రమే చూడటం సరిపోదు. బెంగాల్‌లో చాలా కాలంగా కనిపిస్తున్న రాజకీయ అలసట, అవినీతి ఆరోపణలు, స్థానిక నాయకుల అహంకార ధోరణి, ఉపాధి అవకాశాల కొరత, రాజకీయ హింస వంటి అంశాలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఇప్పుడు ఓట్ల రూపంలో బయటపడినట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా యువతలో “మార్పు అవసరం” అనే భావన బలపడినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అమలు చేసిన సామాజిక సమీకరణ వ్యూహం ప్రత్యేక చర్చగా మారింది. బీసీలు, ఎస్సీలు, గిరిజన వర్గాలు, సరిహద్దు ప్రాంత ప్రజలు, మహిళలు, యువత — ప్రతి వర్గాన్ని రాజకీయంగా భాగస్వామ్యం చేసే ప్రయత్నం కమలం పార్టీ స్పష్టంగా చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా నాయకురాళ్లకు ఇచ్చిన ప్రాధాన్యం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవనం సాగించిన కలితా మాజి ఎమ్మెల్యేగా గెలవడం, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళా నాయకురాళ్లు ప్రజల్లో ఆదరణ పొందడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త దిశను సూచిస్తోంది. ఒకప్పుడు రాజకీయాలు అంటే పెద్ద కుటుంబాలు, ఆర్థికంగా బలమైన వర్గాలకే పరిమితం అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు సామాన్య మహిళ కూడా ప్రజా ప్రతినిధిగా ఎదగగలదని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. రేఖా పాత్ర, రత్నా దేశ్‌నాథ్ వంటి మహిళా నాయకురాళ్ల ఎదుగుదల కూడా ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలను కేవలం వోటు బ్యాంకుగా కాకుండా నాయకత్వ స్థాయికి తీసుకురావాలనే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తున్నదనే విశ్లేషణ వినిపిస్తోంది. గ్రామీణ మహిళలు, మధ్యతరగతి కుటుంబాల మహిళలు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళల్లో కమలం పార్టీకి మద్దతు పెరిగినట్లు ఫలితాల ధోరణి సూచిస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఈరోజు డబ్బు, మీడియా ప్రభావం, కుటుంబ వారసత్వం ఆధిపత్యం పెరుగుతున్న సమయంలో, పెద్ద ఆర్థిక బలం లేని మహిళలకు బీ-ఫారాలు ఇవ్వడం, వారిని గెలిపించడం ద్వారా బీజేపీ ఒక కొత్త రాజకీయ ప్రయోగం చేసినట్లు కనిపిస్తోంది. ఈ అంశాన్ని రాజకీయ విశ్లేషకులు “సామాజిక ప్రజాస్వామ్య విస్తరణ”గా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ సానుకూల మార్పులపై దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో చర్చ జరగడం లేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
బీజేపీపై విమర్శలు, ఆరోపణలు, రాజకీయ రంధ్రాన్వేషణ ప్రధాన చర్చగా మారుతున్న సమయంలో, అట్టడుగు వర్గాల రాజకీయ భాగస్వామ్యం, మహిళా నాయకురాళ్ల ఎదుగుదల, సామాన్య కార్యకర్తల రాజకీయ ప్రాధాన్యం వంటి అంశాలు పెద్దగా వెలుగులోకి రావడం లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రభావాన్ని చూపింది. అభివృద్ధి, సంక్షేమం, జాతీయ భద్రత, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలపై మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో “భారత్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదగాలి” అనే జాతీయ భావన బలపడుతోంది. బెంగాల్ ఎన్నికల్లో మరో ప్రధాన అంశం సరిహద్దు భద్రత. బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లు, నకిలీ పత్రాల వ్యవస్థ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సమస్యలు వంటి అంశాలపై బీజేపీ నిరంతరం స్వరం వినిపించింది.
ఈ అంశాలు కూడా ఓటర్ల నిర్ణయంపై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలపై కూడా బెంగాల్‌లో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా ఉన్న బెంగాల్, తరువాత క్రమంగా పెట్టుబడులను కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ పరిశ్రమలు, ఐటీ రంగం, తయారీ కేంద్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలనే అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. బీజేపీ కూడా ఇదే అంశాన్ని ప్రధాన రాజకీయ దిశగా తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. గ్రామీణ స్థాయిలో బీజేపీ నిర్మించుకున్న సంస్థాగత బలం కూడా ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి సామాజిక వర్గాల నాయకత్వం వరకు పార్టీ సమన్వయంతో పనిచేసినట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా మొదటిసారి వోటు వేసిన యువతలో కమలం పార్టీకి ఆకర్షణ పెరిగినట్లు రాజకీయ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మరో విషయం స్పష్టం చేశాయి. ప్రజలు ఇప్పుడు కేవలం ప్రాంతీయ నినాదాలు మాత్రమే కాదు.. అభివృద్ధి, స్థిరత్వం, భద్రత, జాతీయ దిశ వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అందుకే బెంగాల్‌లో కమలం వికసించడం కేవలం రాజకీయ గెలుపు కాదు.. భారత ప్రజాస్వామ్యంలో మారుతున్న సామాజిక, రాజకీయ చైతన్యానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఒకప్పుడు సిద్ధాంత రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన బెంగాల్‌లో ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం, జాతీయత, సామాజిక అవకాశాల ఆధారంగా కొత్త రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. అదే సమయంలో ప్రపంచ ప్రజాస్వామ్య చిత్రపటంలో భారత్ మరింత బలంగా ఎదుగుతున్నదనే భావనకు కూడా ఈ ఫలితాలు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.