‘నారీ శక్తి’తో రాజకీయ చదరంగం..

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎండమావేనా?

భారతదేశ సామాజిక సాంస్కృతిక చరిత్రలో స్త్రీ మూర్తికి అత్యంత ఉన్నతమైన స్థానం కల్పించబడింది. “మగువా మగువా ఈ లోకానికి తెలుసా నీ విలువ” అన్న సినీ కవి వాక్యం కేవలం భావోద్వేగపూరితమైన సంబోధన మాత్రమే కాదు, అది ఆధునిక భారత ప్రజాస్వామ్యంలో మహిళల అస్తిత్వాన్ని, వారి రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రశ్నించే ఒక గొంతుకగా నిలుస్తోంది. ఒక దేశం సాధించిన పురోగతిని ఆ దేశంలోని మహిళలు సాధించిన పురోగతితో కొలవాలన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్క‌ర్ ఆశయాలకు అనుగుణంగా, చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం ఒక చారిత్రక మలుపుగా భావించబడినప్పటికీ, దాని అమలు చుట్టూ అల్లుకున్న రాజ్యాంగపరమైన నిబంధనలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, ప్రాంతీయ అసమానతలు నేడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా 2026 ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం, భారతదేశ సమాఖ్య వ్యవస్థలో ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ సమతుల్యతను మరోసారి తెరపైకి తెచ్చింది. భారతదేశంలో జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలు, దేశాన్ని శాసించే చట్టసభల్లో మాత్రం నామమాత్రపు ఉనికినే కలిగి ఉన్నారు. 1951-52లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి నేటి 18వ లోక్‌సభ వరకు మహిళల ప్రాతినిధ్యం 5 శాతం నుంచి కేవలం 13.6 శాతానికి మాత్రమే పెరిగింది. ఈ మందకొడి వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే భారతదేశం వెనుకబడి ఉందని స్పష్టం చేస్తోంది. స్కాండినేవియా దేశాలలో మహిళల ప్రాతినిధ్యం 45 శాతానికి పైగా ఉండగా, పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఈ విషయంలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి.
ప్రస్తుత చట్టసభల్లో మహిళల సంఖ్యాపరమైన పరిస్థితిని పరిశీలిస్తే, ఆశించిన లక్ష్యానికి, వాస్తవానికి మధ్య ఉన్న అగాధం స్పష్టమవుతుంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలులోకి రాకపోవడం వల్ల మహిళా లోకానికి జరుగుతున్న నష్టం కేవలం రాజకీయ అవకాశాల కోల్పోవడమే కాదు. ఒక తరం నాయకత్వం విధాన రూపకల్పనలో భాగస్వామ్యం పొందలేకపోవడం. ప్రస్తుతం లోక్ సభ సభ్యుల సంఖ్య 543. అందులో మహిళలు 74 మంది. 33% రిజర్వేషన్ అమలు అయితే ఆ సంఖ్య 181కి పెరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలలో మొత్తం సభ్యుల సంఖ్య 4,123. ప్రస్తుతం మహిళా ఎమ్మెల్యేలు కేవలం 390 మంది మాత్రమే. 33% రిజర్వేషన్ అమలు అయితే ఆ సంఖ్య సుమారు 1,360కి పైగా పెరిగే అవకాశం ఉంటుంది. 74 మహిళా ఎంపీలు, 390 మహిళా ఎమ్మెల్యేలు, మొత్తం 464 మంది మహిళా ప్రజాప్రతినిధులు మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాల విశ్లేషణ ప్రకారం, మహిళా రిజర్వేషన్లు అమలై ఉంటే నేడు దేశవ్యాప్తంగా సుమారు 1,555 మంది మహిళలు చట్టసభల్లో ఉండేవారు. కానీ ప్రస్తుతం కేవలం 390 మంది మాత్రమే ఉండటం వల్ల, సుమారు 1,021 మంది మహిళలు ప్రాతినిధ్య వ్యవస్థకు వెలుపలే ఉండిపోయారు. ఇది దేశ రాజకీయ నిర్మాణంలో కనిపించే ఒక లోతైన నిర్మాణాత్మక అసమానతగా మారుతుంది. చట్టసభలలో ఉండాల్సిన వెయ్యికి పైగా మహిళలు అక్కడ లేకపోవడం అంటే, సమాజంలోని సగం జనాభా ఆకాంక్షలు ప్రతిబింబించాల్సిన స్థలం ఖాళీగా మిగిలిపోవడమే. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ (21.1%) వంటి రాష్ట్రాలు మినహా, మిగిలిన రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతం నుండి 15 శాతం మధ్యనే ఊగిసలాడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు మహిళా మంత్రులు లేదా ముఖ్యమంత్రులు లేకపోవడం కూడా రాజకీయాల్లో పురుషాధిపత్య ధోరణికి అద్దం పడుతోంది. 29 రాష్ట్రాల్లో ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి ఉండటం భారత రాజకీయాల్లోని లింగ అసమానతను తీవ్రంగా ఎత్తిచూపుతోంది.

చారిత్రక మైలురాయి,  అమలులోని చిక్కుముడులు

సెప్టెంబర్ 2023లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో 106వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని (నారీ శక్తి వందన్ అధినియం) ప్రవేశపెట్టింది. మూడు దశాబ్దాల రాజకీయ పోరాటం తర్వాత ఈ బిల్లు లోక్‌సభలో 454-2 ఓట్ల మెజారిటీతో, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ చట్టం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, దిల్లీ అసెంబ్లీలో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్దేశించింది. అయితే ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే అమలులోకి రాలేదు. రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన ఆర్టికల్ 334ఏ ఈ రిజర్వేషన్ల అమలుకు ఒక కీలకమైన షరతును విధించింది. ఈ నిబంధన ప్రకారం, మహిళా రిజర్వేషన్లు రెండు ప్రక్రియల తర్వాతే అమలులోకి వస్తాయి. ఒకటి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి జనగణన పూర్తవ్వాలి. రెండు ఆ జనగణన గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాలి. ఈ నిబంధన వల్ల మహిళా రిజర్వేషన్లు 2024 సాధారణ ఎన్నికల్లో అమలుకు నోచుకోలేదు. కోవిడ్-19 కారణంగా 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడటంతో, తదుపరి జనగణన 2026-27లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మహిళా కోటా అమలు 2029 లేదా అంతకంటే తర్వాతి కాలానికి వాయిదా పడే ప్రమాదం ఏర్పడింది. ఇది “నిరంతర వాయిదా వ్యూహం”గా మారింది. హక్కుల అమలులో జాప్యం జరగడం అంటే వాటిని నిరాకరించడమేనని, వేలాది మంది మహిళా నాయకులను రాజకీయ శక్తి కేంద్రాల బయట నిలబెట్టే ప్రయత్నమిది.

రాజకీయ జూదం, శాసన వైఫల్యం

2026 ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వం మరోసారి మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెస్తూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం 2023 చట్టంలోని ఆర్టికల్ 334ఏ ని సవరించి, రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం. దీని కోసం ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రతిపాదించింది. దీని ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చని ప్రభుత్వం వాదించింది. అయితే ఈ బిల్లులో మహిళా రిజర్వేషన్లతో పాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి పెంచాలనే ప్రతిపాదనను కూడా చేర్చారు. ఈ పెంపుదల వెనుక ఉన్న ఉద్దేశం మహిళలకు సీట్లు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న పురుష సభ్యుల సంఖ్య తగ్గకుండా చూడటమేనని ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఈ వ్యూహం విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది. రాజ్యాంగ సవరణ కోసం అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజారిటీని సాధించలేకపోవడంతో 131వ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. నరేంద్ర మోదీ 12 ఏండ్ల పాలనలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమి తర్వాత ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకుంది. ఈ పరిణామం భారత రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అమలుపై ఉన్న అనిశ్చితిని మరోసారి స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు ఈ బిల్లును “అపహాస్యం”గా అభివర్ణించాయి. 2023లో ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాన్ని మళ్లీ వివాదాస్పదమైన నియోజకవర్గాల పునర్విభజనతో ఎందుకు ముడిపెట్టారని వారు ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల అమలు కంటే 131వ సవరణ బిల్లులో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపైనే ఎక్కువ చర్చ జరిగింది.

మహిళా సాధికారత ముసుగులో రాజకీయం

మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందని విమర్శకులు భావిస్తున్నారు. 2023లో బిల్లును ఆమోదించడం ద్వారా ప్రభుత్వం మహిళల ఓట్లను ఆకర్షించాలని చూసింది. అయితే అమలును భవిష్యత్తుకు వాయిదా వేయడం ద్వారా ప్రస్తుత రాజకీయ ప్రయోజనాలను పొందుతూనే, అమలు బాధ్యతను తప్పించుకుంది. 2026 ఏప్రిల్‌లో ఈ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టడం వెనుక పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే ఉద్దేశం ఉందని విపక్షాలు ఆరోపించాయి. విపక్షాలను మహిళా వ్యతిరేకులుగా చిత్రించడానికి ఈ ప్రత్యేక సమావేశాన్ని ఉపయోగించుకున్నారని వారు విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఉత్తర భారతదేశంలో తన బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. మహిళా రిజర్వేషన్లను దీనికి ఒక “మానవ కవచం”గా వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. 2011 జనాభా లెక్కలను వాడాలని చూడటం వెనుక ప్రస్తుత కుల గణన డిమాండ్ నుండి తప్పించుకునే వ్యూహం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా సాధికారత అనేది ఒక నినాదంగా కాకుండా కార్యరూపంలోకి రావాలంటే, ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్లలోనే రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీట్ల సంఖ్య పెంచడం వల్ల సమానత్వం రాదని, ప్రస్తుతం ఉన్న సీట్లలో మహిళలకు స్థానం కల్పించినప్పుడే అసలైన మార్పు వస్తుందని వారు వాదిస్తున్నారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రయాణం ఒక కంటక ప్రాయమైన మార్గంగా మారింది. చట్టం ఆమోదం పొందినా, అమలుకు నోచుకోకపోవడం వల్ల కోట్లాది మంది మహిళల ఆశలు అడియాశలవుతున్నాయి. మహిళల ప్రాతినిధ్యం అనేది కేవలం రాజకీయ డిమాండ్ కాదు, అది ఒక సామాజిక అవసరం. ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన, జనగణన ప్రక్రియల నుండి వేరు చేయాలి. ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33 శాతం కోటాను తక్షణమే అమలు చేయాలి. రిజర్వేషన్ల అమలుకు ఒక కచ్చితమైన తేదీని ప్రభుత్వం ప్రకటించాలి. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ చెప్పినట్లుగా, చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం మాటల్లో కాదు. కార్య రూపంలో కనిపించాలి. అప్పుడే భారతదేశం నిజమైన ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ యవనికపై తలెత్తుకొని నిలబడగలదు. మహిళా రిజర్వేషన్ కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు. అది ప్రజాస్వామ్య న్యాయం. ఈ న్యాయం ఆలస్యమైతే అది కేవలం మహిళలకే కాదు. మొత్తం దేశ ప్రగతికే నష్టం.

Shravya Sudheer Reddy

– సంకరమద్ది శ్రావ్య సుధీర్ రెడ్డి,

యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు

9000535830

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *