అయోధ్యలో మౌనం ఎందుకు?

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ అంశంపై దేశవ్యాప్తంగా “సనాతన ధర్మ పరిరక్షణ” పేరుతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. రాజకీయ నాయకులు, మత సంస్థలు, సామాజిక వేదికలు స్పందించాయి. చివరకు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాదిస్తూ అనేక మంది గళమెత్తారు.

అదే సమయంలో, అయోధ్య శ్రీ రామమందిర ట్రస్టు విరాళాల నిర్వహణపై కొన్ని ఆరోపణలు, అనుమానాలు బహిరంగ చర్చకు రావడంతో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తినప్పటికీ, తిరుమల అంశంలో కనిపించినంత తీవ్ర ప్రతిస్పందన ఇప్పుడు కనిపించడం లేదు.

ఇక్కడ అసలు ప్రశ్న ఒకటే. సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఆవేదన తిరుమల విషయంలో ఎంత సహజమో, అదే ఆవేదన అయోధ్య విషయంలో ఎందుకు కనిపించడం లేదు? భక్తుల విశ్వాసం తిరుమలలో మాత్రమే విలువైనదా? అయోధ్యలోని రామభక్తుల విరాళాలు కూడా కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి ప్రతీక కాదా? ఈ ప్రశ్నలు ఎవరికైనా అసౌకర్యంగా అనిపించవొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కాదు. ఒక ఆలయంపై వొచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ, మరో ఆలయంపై వొచ్చిన ఆరోపణలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే, అది న్యాయబద్ధమైన వైఖరిగా కనిపించదు. ఒకే ప్రమాణం అందరికీ వర్తించాలి. అదే ధర్మం, అదే నైతికత.

అయోధ్య రామమందిరం దేశ ప్రజల విరాళాలతో నిర్మితమైన పవిత్ర క్షేత్రం. అక్కడి నిధుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమైతే, వాటిని తొలగించే బాధ్యత ట్రస్టుపై, అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై ఉంటుంది. పారదర్శకమైన ఆడిట్, స్వతంత్ర విచారణ, పూర్తి వివరాల బహిరంగ ప్రకటన ద్వారా మాత్రమే భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరచవొచ్చు.

ఈ సందర్భంగా మరొక ప్రశ్న కూడా తలెత్తుతోంది. తిరుమల అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లిన మత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఉద్యమించిన వర్గాలు, అయోధ్య అంశంలో కూడా అదే స్థాయి పారదర్శకతను ఎందుకు కోరడం లేదు? వారి మౌనం యాదృచ్ఛికమా? లేక ఎంపిక చేసిన అంశాలపైనే స్పందించే ధోరణికి నిదర్శనమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఆయా సంస్థలు…ఆయా వ్యక్తులు ..!

ఇక్కడ ఎవరినీ ముందుగానే దోషులుగా ప్రకటించడం సరైంది కాదు. అదే సమయంలో, ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చడం కూడా సరైంది కాదు. సత్యాన్ని వెలికితీయడానికి స్వతంత్ర విచారణ అవసరం. ఆరోపణలు నిరాధారమైతే ప్రజల ముందే స్పష్టత ఇవ్వాలి. నిజమని తేలితే, చట్టం ముందు ఎవరూ మినహాయింపు పొందకూడదు. కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. రామమందిరం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదు. అది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అందువల్ల ఆలయ నిధుల నిర్వహణపై ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వడం ప్రభుత్వ నైతిక బాధ్యత.

ధర్మం అంటే కేవలం భక్తి కాదు; జవాబుదారీతనం కూడా. విశ్వాసం అంటే కేవలం విరాళాలు కాదు; ఆ విరాళాల నిర్వహణలో పారదర్శకత కూడా. తిరుమల అయినా, అయోధ్య అయినా, ఒకే ప్రమాణం ఉండాలి. ఆలయం మారితే ధర్మం మారకూడదు. రాజకీయాలు మారితే నైతికత మారకూడదు. భక్తుల విశ్వాసమే అత్యున్నతమైతే, ప్రతి ఆరోపణపై సమానమైన తీవ్రతతో స్పందించాలి. అదే నిజమైన సనాతన ధర్మ పరిరక్షణకు ప్రమాణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *