హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 50 శాతం భరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సహా ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమై నిధుల కేటాయింపు మరియు డీపీఆర్ పై జరిపిన చర్చలు ఫలప్రదం కావడం, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించ డంతో మెట్రో విస్తరణ కథ ప్రస్తుతానికి సుఖాంతమైనట్టు కనిపిస్తున్నా, ప్రాజెక్ట్ ఆస్తుల విలువ, లోన్ మొబిలైజేషన్ మరియు భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌పై ప్రస్తుతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎస్‌బీఐసీఏపీఎస్ అనే కొత్త కన్సల్టెన్సీని నియమించాయి. ఈ సంస్థ మళ్లీ మొదటి నుండి కొత్త అధ్యయనం చేయాల్సి రావడంతో పనుల్లో మరింత ఆలస్యం జరిగే అవకాశముంది. ఈ ఎస్‌బీఐ కన్సల్టెన్సీ అధ్యయనానికి ఎంత సమయం తీసుకుంటుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. అందువల్ల ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువ! కేంద్ర అంగీకారం నేపథ్యంలో కన్సల్టెన్సీ నివేదిక అందిన తర్వాత రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 122.9 కిలోమీటర్ల మేర విస్తరించనున్న ఈ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిధుల వాటాతో సంయుక్తంగా ముందుకు వెళ్లనున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయి!! విపరీతంగా పెరుగుతున్న హైదరాబాద్ జనాభా కారణంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అత్యంత అవసరమైన మెట్రో ఫేజ్-2 పనులు ఆలస్యం కావడానికి కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు ఆర్థిక నిధుల చిక్కులు, మేనేజ్‌మెంట్ మార్పులు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిబంధనల వివాదాలు అడ్డంకిగా మారాయి. ఫేజ్-1 నిర్వహణలో ఏటా సుమారు రూ.400 కోట్ల నష్టాలు రావడంతో, భారీ పెట్టుబడులతో కూడిన ఫేజ్-2 నిర్మాణంలో భాగస్వామ్యం వహించలేమని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రాజెక్ట్ మోడల్‌ను మార్చాల్సి వొచ్చింది. ఎల్ అండ్ టీ తప్పుకోవడంతో మెట్రోను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.15,000 కోట్ల భారీ ఒప్పందం చేసుకుంది.
ఈ ఆర్థిక సర్దుబాట్లు మరియు లీగల్ ప్రక్రియల వల్ల చాలా సమయం వృథా అయింది. ఫేజ్-1 రీఫైనాన్సింగ్ లోన్ ఫేజ్-2 నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధించిన కొన్ని కఠినమైన షరతులు, నిబంధనల వల్ల క్లియరెన్స్ ఆలస్యమైంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్‌పోర్ట్ రూట్లలో ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసి, ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ కలుపుతూ కొత్త ప్రణాళికలు (122.9 కి.మీ) తయారు చేసింది. ఈ సవరించిన నివేదికలకు కేంద్రం నుండి తుది అనుమతులు రావడానికి సమయం పట్టింది. నిధుల మంజూరు మరియు అనుమతుల విషయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన రాజకీయ పరస్పర ఆరోపణలు కూడా ప్రాజెక్ట్ వేగాన్ని తగ్గించాయి.
అదీకాకుండా ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తో కుదుర్చుకున్న రూ.13527కోట్ల రుణ ఒప్పందం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిబంధనల వివాదంతో తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 84.32 కోట్ల ప్రాసెసింగ్ ఫీజును కూడా ముందుగానే చెల్లించింది. జూన్ 15 లోగా విడుదల కావాల్సిన ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. మెట్రో ద్వారా వొచ్చే టికెట్ ఆదాయం, అడ్వర్టైజ్మెంట్ ఆదాయాన్ని మొదట ఐఆర్ ఎఫ్‌సీ లోన్ రీపేమెంట్‌కే కేటాయించాలని కేంద్రం షరతు విధించింది. అయితే, మెట్రో రోజువారీ నిర్వహణ ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని మాత్రమే అప్పులు తీర్చడానికి వాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఈ వివాదంతో ఈ రుణం నిలిచిపోయింది. ఈ లోన్ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి దిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలు సానుకూలంగా సాగాయని, నిధులు త్వరలోనే విడుదలవుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం!!





