ట్రిబ్యునల్స్ కోర్టులతో నీటి వివాదాలు పరిష్కారమౌతాయా?

“తీర్పులు ఎట్లు వచ్చినా ఎవరో ఒకరు కోర్టులను ఆశ్రయించితే ఇంతే సంగతులు. కోర్టుల్లో కేసు ఓడిన వాడు కోర్టు దగ్గరనే ఏడ్చితే గెలుపొందిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చినట్లు. అందుకు భిన్నంగా రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా వ్యవహరించడం ఉత్తమం. కోర్టులు ట్రిబ్యునల్ తీర్పులు వలన ప్రయోజనం శూన్యం. ఇది అనంతంగా సాగుతూనే ఉంటుంది. వచ్చిన చిక్కు ఏమంటే ఒక వేళ సామరస్య పరిష్కారమంటే రెండు రాష్ట్రాలు ఏదో కొంత మేరకు నష్టపోవలసి ఉంటుంది. కానీ అధికార పార్టీలు ఇందుకు తలొగ్గినా ప్రతి పక్షాలు సామరస్య పరిష్కారానికి అంగీకరించే పరిస్థితి నేడు తెలుగు రాష్ట్రాల్లో లేదు..”

ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాలపరిమితిని ఈ ఆగస్టు నుండి 2027 జూలై ఆఖరు వరకు పొడిగించుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ విజ్ఞప్తి మేరకు ఒక సంవత్సర కాలం పొడిగింపబడింది. ఇదే ఆఖరు పొడిగింపుగా భావించలేము. గతంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు ముగిసిన తర్వాత కృష్ణ బేసిన్ లో అన్ని రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారానికి 2004 లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నియామకం జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2010 లో మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కింది. ప్రస్తుతం తమ అభ్యంతరాలు ట్రిబ్యునల్ ముందు చెప్పుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
    అనంతరం 2013 లో ట్రిబ్యునల్ తుది తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో న్యాయం జరగ లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. తుది తీర్పు వచ్చి 13 ఏళ్లు గడుస్తున్నా  నేటికి స్టే ఆలాగే ఉంది . ఇది ఒక దశ. సుప్రీంకోర్టులో స్టే ఎత్తేసేందుకు కర్ణాటక మహారాష్ట్ర విశ్వ ప్రయత్నాలు చేశాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2014 లో రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కార బాధ్యత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ విచారణ సాగలాగ బడింది. ఈలోపు రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరిగితే తెలంగాణకు న్యాయం జరగదని 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం క్రింద విచారణ జరగాలని కెసిఆర్ సుప్రీంకోర్టు కెక్కారు. అయితే రెండవ మారు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ నియామకంపై తీర్మానం చేశారు. అంత మాత్రాన ట్రిబ్యునల్ నియామకం జరగలేదు. రాజకీయ ప్రయోజనం లేనిదే పిల్లికి కూడా భిక్షం పెట్టని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతిమంగా 2023 శాసనసభ ఎన్నికల ముందు రాజకీయంగా తెలంగాణలో లాభ పడవచ్చని ట్రిబ్యునల్ నియామకానికి ఆదేశాలు జారీ చేశారు.
    అంత వరకు రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరుపుతుండిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ట్రిబ్యునల్ కాల పరిమితినే ప్రస్తుతం ఒక సంవత్సరం కాలం పొడిగింపబడింది. 2023 నుండి ఈ విచారణ నడుస్తోంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ తుది తీర్పుకు లోబడి ట్రిబ్యునల్ విచారణ సాగించ వచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసే నీటి పరిమాణం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టిఎంసిల తో పాటు ఇదే ట్రిబ్యునల్ గతంలో 65 శాతం లభ్యతపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 194 టీఎంసీలు కూడా కలిపి 1005 టిఎంసిలు పంపిణీ చేస్తుందని కౌందరు భావిస్తున్నాను. అయితే న్యాయ పరంగా ఇది వీలు కాదని గతంలో ట్రిబ్యునల్ కేటాయించిన కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ చేయ లేదని ఫలితంగా చట్టబద్ధత లేదని కొందరు భావిస్తున్నారు. .ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు అమలులో ఉన్న  అంశం గుర్తు చేస్తున్నారు.
ఏ ట్రిబ్యునల్ తీర్పు గాని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తేనే దానికి చట్ట బద్దత ఏర్పడటం వాస్తవం. ఇదిలా ఉండగా మున్ముందు సుప్రీంకోర్టు తీర్పు ఏలా ఉంటుందో వేచి చూడాలి. ఒక వేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రెండవ మారు జారీ చేసిన జీఓ  రద్దు చేస్తే దానిపైననే తిరిగి సుప్రీంకోర్టు ఆశ్రయించవలసి ఉంది . తీర్పులు ఎట్లు వచ్చినా ఎవరో ఒకరు కోర్టులను ఆశ్రయించితే ఇంతే సంగతులు. కోర్టుల్లో కేసు ఓడిన వాడు కోర్టు దగ్గరనే ఏడ్చితే గెలుపొందిన వాడు ఇంటికి వచ్చి ఏడ్చినట్లు. అందుకు భిన్నంగా రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా వ్యవహరించడం ఉత్తమం. కోర్టులు ట్రిబ్యునల్ తీర్పులు వలన ప్రయోజనం శూన్యం. ఇది అనంతంగా సాగుతూనే ఉంటుంది. వచ్చిన చిక్కు ఏమంటే ఒక వేళ సామరస్య పరిష్కారమంటే రెండు రాష్ట్రాలు ఏదో కొంత మేరకు నష్టపోవలసి ఉంటుంది. కానీ అధికార పార్టీలు ఇందుకు తలొగ్గినా ప్రతి పక్షాలు సామరస్య పరిష్కారానికి అంగీకరించే పరిస్థితి నేడు తెలుగు రాష్ట్రాల్లో లేదు.
      ఏళ్ల కొద్దీ సాగలాగడం ఒక్క కృష్ణ జలాల వివాద ట్రిబ్యునల్ ఒక్కటే కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వంశధార నదీ జలాల వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఒడిషా రాష్ట్రాల మధ్య అనంతంగా సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ఒడిషా రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 2010 లో ట్రిబ్యునల్ ను నియమించింది. ట్రిబ్యునల్ 2017 లో మధ్యంతర తీర్పు చెప్పింది. కాని ఒడిషా సుప్రీంకోర్టు కెక్కింది. తిరిగి ట్రిబ్యునల్ 2021 లో తుది తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య వరకు ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై చేయలేదు. ఇక్కడ  విషాదమేమంటే వంశధార నది నీళ్లను ఒడిషా ఉపయోగించుకోవడం లేదు.
తమ భూభాగంలో ముంపు ఉంటుందని  నది వట్టి పోతుందని సాకులు చెప్పింది. ఫలితంగా ఏటా వంశధార నుండి వంద టీఎంసీల నీళ్లు సముద్రం పాలౌతున్నాయి.
ఇదే విధంగా మహానది జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం 2018 లో ట్రిబ్యునల్ నియామకం చేసింది. ఛత్తీస్ ఘడ్ ఒడిషా రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది . ఇప్పటికీ పరిష్కారం నోచుకోలేదు. ఈ ట్రిబ్యునల్ గడువు తాజాగా 2027 వరకు పొడిగింపబడింది.చాల రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు వివిధ కారణాలతో గొంతెమ్మ కోర్కెలు కోరడంతో వివాదాలు ఎక్కువౌతున్నాయి. దానికి తోడు ఆయా రాష్ట్రాల్లోని ప్రతి పక్షాలు రాజకీయ కారణాలతో సామరస్యం కుదరనీయడం లేదు. దీనికి తోడు ట్రిబ్యునల్ లు కూడా ఏళ్లు పూళ్లు సాగలాగడంతో సత్వర న్యాయం లభించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *