కాళేశ్వరం అవినీతికి అండగా రేవంత్‌ ‌చర్యలు

– కెసిఆర్‌ను కాపాడుతున్నది సిఎం రేవంతే
– 30 నెలలుగా చర్యలు తీసుకోక పోవడంపై అనుమానాలు
– నిజామాబాద్‌ ‌ఎంపీ ధర్మపురి విమర్శలు

న్యూదిల్లీ, జూలై 23: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఈ 30 నెలలుగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఏం చేశారని నిజామాబాద్‌ ‌బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ‌సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ సీఎంను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు.  గురువారం న్యూదిల్లీలో బీజేపీ ఎంపీ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల విలువైన పనులు జరిగిన తర్వాత ఎన్డీఎస్‌ఏ ‌దగ్గరకు వచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రూ. లక్ష కోట్లు నీళ్లలో పోయాయని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారు. రూ. లక్ష కోట్లు ముంచిన కేసీఆర్‌ను రేవంత్‌ ‌రెడ్డి కాపాడుతున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌దోచుకున్న పైసలను ప్రస్తుతం వారి నుంచి సీఎం రేవంత్‌ ‌దోచుకుంటున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌కుటుంబం వద్ద సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఎంత తీసుకున్నాడు.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీకి ఎంత ఇచ్చాడని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ‌ప్రశ్నించారు. తెలంగాణలో సాగు, తాగు, థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్లకు నీరు అందడం లేదని అరవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంపద లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఏం చేద్దామను కుంటున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి చేసినవారు, ప్రస్తుతం కాపాడే వ్యక్తి బాగానే ఉన్నారంటూ మధ్యలో రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2023లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎన్డీఎస్‌ఏ ‌నివేదిక ఇచ్చిందని, 2019 లోనే మూడు బ్యారేజీల వద్ద పనులు ప్రారంభించిన వెంటనే పగుళ్లు వచ్చాయని పేర్కొందని తెలిపారు. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్లు ఇసుక కారణంగా కుంగిపోయాయని ఎన్డీఎస్‌ఏ ‌వివరించిందన్నారు. డీపీఆర్‌ అనుమతులు లేకుండానే కాళేశ్వరం నిర్మించారని, ఈ బ్యారేజీలను ముందస్తు ప్రణాళిక ప్రకారం కాక వేరేచోట నిర్మించారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు కమీషన్లు ఇవ్వాలనే ఆతృతతో ఆగంఆగంగా నిర్మించారని తెలిపారు. డిజైన్లు ఎందుకు మార్చారు.. అందుకు సంబంధించిన ఫైళ్లు అడిగితే జవాబు ఇవ్వలేదని ఎంపీ మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల కూడా మేడిగడ్డ మాదిరిగానే ఉన్నాయన్నారు. మూడు బ్యారేజీలను పూర్తిగా పరిశీలించి అవసరమైనచోట రిపేర్లు చేయాలని ఎన్డీఎస్‌ఏ ‌సూచించిందని వివరించారు.
—————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *