‘పీఎం విశ్వకర్మ యోజన’తో ఆర్థిక భరోసా

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
– పార్టీ కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : గత ప్రభుత్వాలు విస్మరించిన చేతివృత్తుల వర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన ద్వారా ఆర్ధిక భరోసాతోపాటు సముచిత గుర్తింపు కల్పించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తెలిపారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ఎంతో చారిత్రక, విశిష్టమైన దినమని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినంతోపాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, దేవ శిల్పి భగవాన్ విశ్వకర్మ జయంతి ఒకే రోజు రావడం ఎంతో శుభపరిణామమన్నారు. దేశ నిర్మాణంలో కమ్మరి, వడ్రంగి, కంసాలి, స్వర్ణకారులు, శిల్పులు వంటి అనేక చేతివృత్తుల వర్గాల శ్రమ ఎనలేనిదని అన్నారు. అయితే గత పాలకులెవరూ ఈ చేతివృత్తుల కులాల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వారి శ్రమను గుర్తించి వారికి ఉపాధితోపాటు నేరుగా ఆర్థిక సహాయం అందించాలనే సంకల్పంతో ‘పీఎం విశ్వకర్మ యోజన’ను ప్రవేశపెట్టారని వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా లక్షలాదిమంది లబ్దిదారులకు సులభతర రుణాలు, పనిముట్లు, శిక్షణ అంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, వ్యాపారాలను విస్తరించుకోగలుగుతున్నారని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామిగా దూసుకుపోతున్న వేళ వోకల్ ఫర్ లోకల్ – లోకల్ టు గ్లోబల్ అనే నినాదంతో స్వదేశీ చేతివృత్తుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ తెచ్చేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోందన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో చేతివృత్తుల వారు కేవలం ఉపాధి పొందడమే కాక ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నదే మోదీ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రజలకు, చేతివృత్తుల సోదర సోదరీమణులందరికీ భగవాన్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, సీనియర్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *