“యాష్ ట్రే వంటి మంచి కథలు రాసిన రచయిత, అనువాదం, విమర్శ, నాటకం, పరిశోధన రంగాల్లో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్య ఉద్యమశీలి- చాగంటి తులసి తొంభయ్యవ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా తిరునగరి దేవకీదేవి రాసిన విమర్శనాత్మక వ్యాసాన్ని మూడు వారాల పాటు శోభ పాఠకుల కోసం ప్రచురిస్తున్నాము.”
హూందాకథ మధ్యతరగతి కుటుంబీకులుదే. ఈ కథలోనూ పెద్దకూతురు మెట్రిక్యులేషన్లో ఆ ఊళ్ళోని ఆరుస్కూళ్ళ్ళలో మొదటిర్యాంకు సంపాదించింది. మిగిలిన తమ్ముళ్ళ చదువులకు ఊతమిచ్చింది. ఐనా ఆమె పైచదువు గురించి ఏ మాత్రం ఆలోచించలేదు తల్లిదండ్రులు. తమ స్తోమత కొద్దీ వరుణ్ణి చూసి పెళ్లి చేయడం వరకు సబబే. నిజానికి ఆమె పరిజ్ఞానం, కోచింగ్ వల్లనే తరువాతి పిల్లలు పై చదువులు బాగా చదువుకున్నారని తెలుస్తుంది. ఇంట్లో తమ్ముళ్ళందరూ గట్టెక్కడానికి ఆలంబనంగా నిలిచినా ఊళ్ళో విద్యార్థులందరికన్నా మంచి ర్యాంకు సాధించినా పై చదువులకు తల్లిదండ్రులు అవకాశమివ్వలేదు. అది కేవలం ఆడపిల్లకు పెళ్ళిచేస్తే భారం దిగిపోతుందని, వచ్చిన సంబంధం తప్పితే మళ్ళీ సంబంధం దొరకదేమో అనేభయంతో. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాకున్నా సామాజిక వాతావరణం. ఐతే ఏటికెదురీదే వాతావరణంలో సాహసం తోడైనప్పుడే సమాజం కొత్తపంథాకి అలవాటు పడుతుంది. తన మార్గదర్శనంలో తరువాతి వాళ్ళందరూ ఉన్నతంగా చదువుకొని స్థితిమంతులైన్రు. తమ్ముడు ఆదరంగా కొనిచ్చిన బట్టల్లోనూ తేడా స్పష్టం. ఐనా ఆఅక్క తమ్ముణ్ణి చూసి అసూయపడకపోవడమే కాదు అతని నుండి ఆర్థికసహాయం నిరాకరించడం గొప్పలక్షణమే కదా. అదే హుందా కథగా మనముందుకొచ్చింది.
దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లి చేయడం సమస్య అటుంచి పెళ్లిచూపుల్లో అమ్మాయిని తయారు చేయడానికి చీరతో సహా వస్తువులను అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని వివరిస్తున్న కథ వైవాహికం. పెళ్ళి కావలసిన అమ్మాయి తమ్ముడి పసి అంతరంగమే ఆడపిల్లలపై జరుగుతున్న వివక్షను తేటతెల్లం చేస్తున్న కథ కూడా. పిల్లవాడి పేరు వేణు. ‘‘కాబోయే వరుడికి చక్కటి పిల్ల కావాలట. పాడే పిల్ల కావాలట. చదువుకున్నపిల్ల కావాలట. మరి అక్కయ్య చక్కగా ఉంది. అక్కయ్య చదువుకుంది. అక్కయ్య పాడుతుంది. కట్నంతో వచ్చేపిల్ల కావాలిట. నాన్న ఎలాగో పెళ్లికి అప్పు చేస్తానంటున్నాడు. అంటే వరుడికి కావలిసిన యోగ్యతలన్నీ మా అక్కయ్యకున్నా పెళ్ళి కావడం లేదని” తమ్ముడి అంతరంగం. ‘‘పిల్లకు పిల్లవాడు నచ్చక్కర్లేదేమిటి? తండ్రిప్రశ్నకు ‘‘అందం కొరుక్కుతింటామా?‘ పిల్లకు పిల్లవాడు నచ్చడమేంటని తల్లి మందలించడం మరో ఉదాహరణ. అమ్మాయి తమ్ముడికి అక్క పెళ్ళి జరుగకూడదని బలంగా ఉంటుంది. కారణం ‘‘వాళ్ళ ఎదురింటి అమ్మాయికి పెళ్ళికాగానే మొగుడితో కాపురానికి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. బోలెడన్ని రోజులైనా తిరిగి రాలేదు. అక్కయ్య వెళ్ళిపోతే తనకు పాఠాలు ఎవరు చెబుతారు?” వంటి అనేక సందేహాలు పసిమనసుకి. మొత్తంగా అక్కతో తన సంబంధం తెగి పోతుందని పిల్లవాడి ఆలోచన. ఏమైనా పెళ్ళి తతంగం స్త్రీకి పుట్టింటి సంబంధం దూరమవడం నిజమే కదా!
బామ్మగారి రూపాయి. కథ చదువుతుంటే ‘పాముకు పాలుపోసి చీమలకు పంచదార వేసెడి ఈ దేశంలో’ అనే జాషువా కవితా గుర్తొచ్చింది. పిల్లలను ఇంట్లో పెట్టి తగినన్ని జాగ్రత్తలు చెప్పి కొబ్బరికాయ, పూజారి దక్షిణలతో గుడికిపోయిన పెద్దలు. పిల్లలంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు చాలీచాలని పంచె కట్టుకొని ఓ కర్ర పట్టుకొని రెండోచెయ్యి ఓ పిల్లవాడి బుజంమీద వేసి ఓ ముసలావిడ వస్తుండగా పిల్లలందరిలో పెద్దదైన అక్క ముష్టిముండలా ఉందంటూ ఆమెరాకను అడ్డుకోచూస్తూ ‘‘ఇంట్లో కొచ్చేస్తున్నావేమిటి? అక్కడే ఉండు” అంటూ తలుపు వేసే ప్రయత్నం చేస్తుండగా తమ్ముడు మాత్రం ఆ పిల్లవాడిని తన స్కూల్ విద్యార్థిగా గుర్తుపట్టి ‘‘రండి బామ్మగారు రండి‘‘ అంటూ ఆహ్వానించి ఆ వ్యక్తి తన దిక్కులేని దీనావస్తను చెప్పి కంటతడి పెట్టుకోగానే ఇంట్లోకి పరిగెత్తి పెట్టెలోంచి ఓ చొక్కా లాగు తెచ్చి అక్క నివారించ చూస్తున్నా రామారావుకు ఇవ్వడమే కాక తండ్రి ప్రతినెలా బామ్మకిచ్చే ఐదు రూపాయిలు భాగవతంలో ఉంటాయని గుర్తు తెచ్చుకొని ఓ రూపాయి తీసిస్తాడు. అది గుడినుండి వచ్చిన పెద్దలకు కోపం తెప్పించింది. ఈ సహాయ కార్యక్రమం పెద్దలకు నచ్చలేదు. పిల్లవాడికి మాత్రం సమర్థనీయంగా తోచింది. ఆ పెద్దలు గుళ్ళో పూజలు పునస్కారాలవల్ల పుణ్యాన్ని మూటకట్టుకునే భావనలో ఉన్నారు. పిల్లవాడు మాత్రం బీదవాడికి సహాయం చేయడం మంచిదనుకున్నాడు. మరుస్తలే యధా వృష్టిః క్షుధార్తే భోజనం తథా దరిద్రే దీయతే దానం సఫలం పాండునందన అని శ్లోకం చెప్తున్నదికదా. ఆ చిన్నమనసుకు ధర్మం, న్యాయం సూత్రాలు తెలీకపోయినా సహాయం చేసే లక్షణమున్నవాడు. స్వార్థంతో చేసే పూజలు తెలియనివాడు. ఇక ముసలావిడ చింపుబట్టలను చూసి ఇంట్లోకి రానివ్వకుండా ఆపే ప్రయత్నంలో ఆమె ‘‘మేమూ బ్రాహ్మలమే” అంటుంది. అగ్రవర్ణాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారన్న మాట రచయిత్రి చెప్పినట్లు అనిపిస్తుంది.
జట్టీకథలో మధ్యతరగతి కుటుంబాల కన్నా డౌన్ ట్రాడెన్ జనాలకు నిర్మొహమాటం, పారదర్శకత ఎక్కువ. తెగేదాకా లాగకూడదంటారు. మొగుడు తాగొచ్చి రోజూ తన్ని తగిలేస్తున్నా తను పనిచేస్తున్న ఇంటి అమ్మగారు విడాకులు ఇవ్వమని పదేపదే రెచ్చగొట్టినా కాదుకూడదంటూ సహించిన పనిమనిషి మేనమామ కొనిచ్చిన చీర కట్టుకున్నందుకు రంకు అట్టగట్టగానే ఆత్మాభిమానం దెబ్బతిన్నది. తాగొచ్చి కొట్టినదెబ్బకన్నా అభియోగం కోపాన్ని తెప్పించింది. నువ్వు రంకుతనం అంటగట్టడమెందుకు నేను మామనే మనువు చేసుకుంటానని వెళ్ళిపోతుంది. అసలు మలుపు ఏమిటంటే ఇన్నాళ్లు పనిమనిషిని భర్త నుండి విడిపొమ్మని రెచ్చగొట్టిన యజమానురాలు, సభలు సమావేశాల్లో స్త్రీ సమస్య మీద అనర్ఘళంగా మాట్లాడే మనిషి తనభర్త అదేవీథిలో తన పనిమనిషి కన్నా తక్కువరంగులో అందవిహీనంగా ఉండే మనిషితో సంబంధం పెట్టుకున్నాడని తెలిసినా ఆయనతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడలేదు. ఈ విషయంలో శ్రామిక జనం మారుమనువును ఆహ్వానిస్తారు. వాళ్ళలో ఆ సంప్రదాయం ఉంది. ఈ తరం ఆ విషయంలో ముందంజ వేసిందనుకొండి.
సంసారాల్లో తండ్రి లేకపోయినా తల్లి, పిల్లలను వృధ్ధిలోకి తెచ్చే సంఘటనలు కోకొల్లలు. దానికి సమాంతరంగా భార్య చనిపోగానే అప్పటికపుడు భార్యకోసం వెతుక్కునే భర్తలు కోకొల్లలు. కట్నం డబ్బులకాశపడి ప్రేమించిన క్లాస్మేట్ ను నిరాకరించిన ప్రబుధ్ధుడు ఓ కొడుకుని కని భార్య చనిపోతే కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ మాజీ ప్రియురాలిని పెళ్ళి చేసుకోమంటూ అడగటానికి ఆయనకు ఏ భేషజాలు అడ్డు రాలేదు. ఆ మాజీ ప్రియుడు తాగే సిగరెట్ కోసం యాష్ ట్రే కి స్థలం కేటాయించమని అడగటం, ప్రతీకాత్మకంగా పెళ్ళి చేసుకోమని అడగడమే. స్థిరత్వం ఆత్మాభిమానం గల స్త్రీగా యాష్ ట్రేకు తన యింట్లో చోటు లేదని చెప్పడమే. రచయిత్రి ఈ పేరు పెట్టడం కథకు నిండుదనాన్ని ఇచ్చింది.
(ఇంకా ఉంది)





