– పన్నెండేళ్ల ప్రసంగాలతో త్రిభాషా గ్రంథం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా వెలువరించిన ‘మోదీ వాణి -సేవ.. సంకల్పం.. వికసిత భారత’ త్రిభాషా గ్రంథాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సంయుక్తంగా ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఈ గ్రంథాన్ని రూపొందించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పన్నెండేళ్ల పాలనా కాలంలో దేశంలో, విదేశాల్లో చేసిన పసంగాలను విస్తృతంగా పరిశీలించి ప్రజల్లో విశేష గుర్తింపు పొందిన ముఖ్యమైన వ్యాఖ్యలు, వాక్యాలు, కొటేషన్లను ఈ గ్రంథంలో పొందుపరిచారు. మోదీ ఆలోచనలు, పాలనా దృక్పథం, జాతీయ దర్శనాన్ని సమగ్రంగా పరిచయం చేశారు.
గ్రంథం ప్రత్యేకతలు
ప్రతి కొటేషన్‌ను ముందుగా మోదీ వ్యాఖ్యానించిన హిందీ భాషలో ఇచ్చి ఆ తరువాత సహజమైన తెలుగు, ఇంగ్లీష్ రూపాలను పొందుపరిచారు. ప్రధానమంత్రి అధికారిక ప్రసంగాలు, విశ్వసనీయమైన ప్రామాణిక ఆధారాలను విస్తృతంగా పరిశీలించి కొటేషన్లను ఎంపిక చేశారు. ప్రతి వ్యాఖ్యకు సంబంధించిన సందర్భం, ప్రసంగ నేపథ్యం, మూల వివరాలను స్పష్టంగా అందించారు. సేవ, సంకల్పం, సుపరిపాలన, అంత్యోదయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, యువశక్తి, రైతు సంక్షేమం, ఆత్మనిర్భర్ భారత్, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ వేదికపై భారతదేశ నాయకత్వం వంటి విస్తృత అంశాలకు ఇందులో స్థానం కల్పించారు. మోదీ సందేశాలు, పాలనా తత్వం, దేశ భవిష్యత్తుపై ఆయన దార్శనికతను మూడు భాషల పాఠకులకు చేరువ చేసే వినూత్న ఆలోచనే ఈ గ్రంథం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతకుమార్, జయశ్రీ, కల్యాణ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, డాక్టర్ వేముల అశోక్, టి. వీరేందర్ గౌడ్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్, సీనియర్ నాయకులు శ్రీనిరెడ్డి, గోపాల్ జీ, సుభాష్ చంద్ర జీ, రాణి రుద్రమ, పద్మ తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు