– నషా ముక్త్ భారత్’ 140 కోట్ల ప్రజల సామాజిక ఉద్యమం:
– ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాతద్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : మరే దేశంలో లేనంతటి యువ జనాభా మన భారత్ సొంతమని, అలాంటి యువతను డ్రగ్స్ మహమ్మారి బారి నుండి కాపాడుకోకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నషా ముక్త్ భారత్ – హైదరాబాద్ వాక్స్ పాదయాత్ర సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ రహిత భారత్ సాధన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్, హోల్ ఆఫ్ ఇండియా, హోల్ ఆఫ్ 140 క్రోర్స్ పీపుల్’ (ప్రభుత్వం, దేశం, 140 కోట్ల ప్రజల సమష్టి భాగస్వామ్యం) విధానంతో ముందుకెళ్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం పోలీసులదో, ప్రభుత్వాలదో కాదని, ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు, మీడియా ప్రతినిధి, సోషల్ మీడియా వారియర్ భాగస్వాములయ్యే మహా ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు వ్యవసాయం, ఇంజనీరింగ్, ఆటోమొబైల్ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన పంజాబ్ రాష్ట్రం నేడు ఇంటింటికీ డ్రగ్స్ వ్యాపించి ఎలా నిర్వీర్యమవుతోందో మన కళ్లముందే చూస్తున్నామని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహమ్మారి క్రమంగా హర్యానా, దిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరిస్తోందని, ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. భారత వ్యతిరేక, ఉగ్రవాద శక్తులు తమ ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకునేందుకు మన దేశంలోకి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆ డబ్బుతో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మత్తుకు అలవాటుపడిన 22 శాతం యువత
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడం, తల్లిదండ్రులు ఉద్యోగాల్లో నిమగ్నమవడం వల్ల పిల్లల్లో ఒంటరితనం పెరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గంటల తరబడి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాలో గడుపుతూ యువత కొత్త స్నేహాల ద్వారా మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, పట్టణ ప్రాంతాల్లో 25 శాతం మంది యువత ఏదో ఒక రూపంలో మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ కేవలం ధనికుల పిల్లల సమస్యే కాదని, హైదరాబాద్లోని అంబర్పేట, బోరబండ వంటి బస్తీల్లోని పేద కుటుంబాల యువత కూడా గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, సాయంత్రమైతే బస్తీల్లో వీధి లైట్లు పగలగొట్టి చీకట్లో డ్రగ్స్ వాడుతున్నారని మహిళలు స్వయంగా తన వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 2029 నాటికి ‘నషా ముక్త్ భారత్’ సాధించాలనే లక్ష్యంతో పటిష్ట కార్యాచరణ రూపొందించిందని కిషన్ రెడ్డి వివరించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ తయారీ సంస్థలను నెంబర్-1 టార్గెట్గా, సరఫరా చేసే స్మగ్లర్లను నెంబర్-2 టార్గెట్గా ఎంచుకుని ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అయితే డ్రగ్స్ వాడే యువతను నేరస్థుల్లా చూడకూడదన్నారు. ఎవరైనా విద్యార్థి లేదా యువకుడు డ్రగ్స్ బారిన పడితే తోటి విద్యార్థులు హేళన చేయకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని వెలివేయకుండా, ప్రచారం కాకుండా అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పి ఆ ఊబి నుండి గౌరవప్రదంగా బయటకు తీసుకురావాలని సూచించారు.
సరిహద్దులో నిఘా పటిష్టం
సరిహద్దుల్లో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి పారామిలిటరీ బలగాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి, జాగిలాల సంఖ్యను, స్పెషల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ బానిసలైన పేద కుటుంబాల పిల్లలకు ఉచిత వైద్యం అందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 300 పునరావాస కేంద్రాలను 2,000కు పెంచాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వీటిలో కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని, మీడియా కూడా బాధితుల ఫోటోలు ప్రచురించకుండా వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా కథనాలు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది యువతకు అవగాహన కల్పించడంతోపాటు మొదటి దశలో లక్ష మంది ‘నషా ముక్త్ భారత్ మిత్ర’ వలంటీర్లను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
భూములు అమ్మడం కాదు..క్రీడా మైదనాలు ఏర్పాటు చేయాలి
యువతను వ్యసనాల వైపు వెళ్లకుండా కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా’, ‘యోగా’ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ భూములను అమ్మకుండా రక్షించి ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి నిర్వహించాలని కోరారు. అలాగే డీ-అడిక్షన్ కేంద్రాల నుండి కోలుకుని బయటచ్చిన యువతకు మధ్యలో ఆగిపోయిన చదువును తిరిగి అందించడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





