– నాడు కేసీఆర్ భూములను కాపాడారు
– నేడు వీటిని అమ్మేందుకు రేవంత్ సర్కార్ యత్నం
– మంచిరేవులలో రూ.2వేల కోట్ల భూ కుంభకోణం
– గ్రేహౌండ్స్ భూముల జీరో వాల్యూ రిజిస్ట్రేషన్‌పై విచారణ జరపాలి
– కంచగచ్చిబౌలి భూముల తాకట్టుతో రూ.10వేలకోట్ల అప్పు
– మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు న్యాయస్థానాల్లో పోరాడి కాపాడిన వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తానే పరిరక్షించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో ముఖ్యమంత్రి ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిరేవుల గ్రేహౌండ్స్ భూములు, మియాపూర్, భూపాలపల్లి అటవీ భూములు, ఐఎంజీ భారత్, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కోర్టు తీర్పులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, భూభారతి రికార్డులను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై చేసిన వ్యాఖ్యలన్నీ అర్ధసత్యాలేనని హరీశ్ రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం న్యాయస్థానాల్లో సంవత్సరాల తరబడి పోరాడి సాధించిన విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటున్నదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే మియాపూర్ భూములను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని ఆరోపించారు.
మంచిరేవులలో రూ.2 వేల కోట్ల భూ కుంభకోణం
మంచిరేవులలోని 142 ఎకరాల గ్రేహౌండ్స్ భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్ రావు పేర్కొన్నారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూముల కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. అనంతరం 2017 మే 19న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో సీనియర్ న్యాయవాదులను నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ న్యాయపోరాటం ఫలితంగా 2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్, 2023 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులిచ్చాయని వివరించారు. అయితే ప్రస్తుతం అదే భూముల్లోని 10 ఎకరాల 10 గుంటలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు గ్రేహౌండ్స్ ప్రహరీని కూల్చివేశారని ఆరోపించారు. గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 8886/2026 ద్వారా సర్వే నంబర్లు 362, 373, 374లోని భూములను రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. రిజిస్ట్రేషన్ పత్రాల్లో భూమి మార్కెట్ విలువ రూ.45.39 కోట్లుగా ఉన్నప్పటికీ, కన్సిడరేషన్ విలువ సున్నాగా పేర్కొన్నారని చెప్పారు.ఈ భూములు డ్రీమ్ వ్యాలీ సంస్థలకు సంబంధించిన వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ అయ్యాయని, అనంతరం ప్లాట్లుగా విభజించి మరిన్ని రిజిస్ట్రేషన్లు నిర్వహించారని ఆరోపించారు. భూభారతి రికార్డుల్లో ఇప్పటికీ సంబంధిత భూములు గ్రేహౌండ్స్ శాఖ పేరుమీదే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.వెయ్యి కోట్ల ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందని ఆరోపించారు.గ్రేహౌండ్స్ ఫైరింగ్ రేంజ్ విస్తరణకు సంబంధించిన మరో 10 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను 2026 సెప్టెంబర్ 3న హైకోర్టు రద్దుచేసిందన్నారు. కొత్తగా భూసేకరణ చేపట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ రెండు వ్యవహారాల్లో మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
మియాపూర్ భూముల విజయానికి బీఆర్ఎస్ పోరాటమే కారణం
మియాపూర్ ప్రభుత్వ భూముల పరిరక్షణలో బీఆర్ఎస్ ప్రభుత్వానిదే కీలక పాత్ర అని హరీశ్ రావు తెలిపారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించిన భూముల వ్యవహారంలో గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించి, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసిందన్నారు. పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు.2016 జూన్ 1న జారీచేసిన జీవో నంబర్ 45, ట్రినిటీ ఇన్‌ఫ్రావెంచర్స్ కేసులో జరిగిన న్యాయపోరాటం మియాపూర్ భూములపై ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో మియాపూర్ కేసు మొత్తం 192 సార్లు విచారణకు రాగా, బీఆర్ఎస్ హయాంలో 95 విచారణలు జరిగాయని వివరించారు. సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్ 86 సార్లు హాజరై వాదనలు వినిపించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 11 విచారణలు మాత్రమే జరిగాయని పేర్కొన్నారు.ఇప్పుడు తీర్పు రాగానే భూములను విక్రయించేందుకు ప్రభుత్వం ఎందుకు తొందరపడుతున్నదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు ఉపయోగించకుండా అమ్మకానికి పెట్టడం సమంజసమా అని నిలదీశారు.
భూపాలపల్లి అటవీ భూములపైనా వివాదం
భూపాలపల్లిలోని 106 ఎకరాల అటవీ భూములను కాపాడేందుకు కేసీఆర్ ప్రభుత్వం సుదీర్ఘ న్యాయపోరాటం చేసిందని హరీశ్ రావు వివరించారు. 2018లో హైకోర్టు సింగిల్ బెంచ్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. 2021లో డివిజన్ బెంచ్ తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ 6937/2021 దాఖలు చేశామని తెలిపారు.భూముల్లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై పలువురిని అరెస్టు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 18న సుప్రీంకోర్టు తీర్పు వెలువడటానికి గత ప్రభుత్వ న్యాయపోరాటమే కారణమని చెప్పారు.
కంచగచ్చిబౌలి భూముల తాకట్టుపై ఆరోపణలు
ఐఎంజీ భారత్ వ్యవహారంలో కంచ గచ్చిబౌలి, మామిడిపల్లి ప్రాంతాల్లోని మొత్తం 850 ఎకరాల భూములను పరిరక్షించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లపాటు న్యాయపోరాటం చేసిందని హరీశ్ రావు తెలిపారు. 2024 మార్చి 7న వెలువడిన తీర్పును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన విజయంగా ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ఆధారంగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల అప్పు సమీకరించిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన మధ్యవర్తికి రూ.400 కోట్ల కమిషన్ చెల్లించారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ అటవీ భూముల విషయంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ప్రభుత్వ భూముల రక్షణకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తున్నదని విమర్శించారు.మంచిరేవుల గ్రేహౌండ్స్ భూముల రిజిస్ట్రేషన్లు, కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు, మధ్యవర్తులకు కమిషన్ల చెల్లింపులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు