– కారుచౌకగా అమ్మిన భూమిలో హైరైజ్ అపార్టుమెంట్ నిర్మాణం
– ఒక బిల్డర్ కోసం పది అపార్టుమెంట్లను కూలుస్తారా?
– డబుల్ బెడ్రూమ్ పేదల దారిని కూడా మూసేశారు
– అడిగితే పోలీసులతో బెదిరింపులు
– ఏ భవనంపై చేయిపడ్డా వూరుకోం
– బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు హరీష్ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి.. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకానీ కొందరు వ్యక్తుల స్వార్థం కోసం పనిచేయకూడదని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు అన్నారు. గండిపేట మండలం నార్సింగిలో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్పు వల్ల నష్టపోతున్న సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్ తదితర కాలనీల్లో శనివారం పరిశీలించారు. హెచ్ఎండీఏ అధికారులు వేసిన రెడ్ మార్కింగ్‌లను పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. అన్ని అనుమతులు, ఓసీలు ఉన్నా తమ భవనాలను కూల్చేందుకు మార్కింగ్ చేశారంటూ కాలనీవాసులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేసిన అజయ్ కుమార్, శోభ, శ్వేత, పద్మజ, రిటైర్డ్ జిల్లా జడ్జి విజయ్ కుమార్, ప్రసన్నత, డాక్టర్ నందగోపాల్, అలెగ్జాండర్ రెడ్డి, అనిల్ కుమార్, వివిధ అపార్ట్మెంట్ల అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులు, నష్టపోతున్న అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మాటలు వింటుంటే ప్రభుత్వం ఎంత అరాచకంగా వ్యవహరిస్తోందో స్పష్టమవుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఈ రోడ్డు కోసం మాస్టర్ ప్లాన్‌లో మార్కవుట్ ఇచ్చారని, ఆ గెజిట్‌లో ఇక్కడి గుట్టను తొలగిస్తూ గుట్ట మీద ఉన్న 400 ఏళ్ల చారిత్రక హనుమాన్ టెంపుల్‌ను కూల్చేస్తూ రోడ్డు అలైన్మెంట్ ఉండేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆలయాన్ని కాపాడాలని స్థానికులు అప్పటి ఎమ్మెల్యే సబిత దృష్టికి తీసుకొచ్చారని, వెంటనే ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడగా ఆ రోడ్డును యథావిధిగా కొనసాగిస్తూనే గుడిని కాపాడుతూ పక్కనే ఉన్న స్థలం నుంచి మెయిన్ రోడ్డుకు కలిపేలా 2018లో కొత్త గెజిట్ (జీవో నం.181) ఇచ్చిందని చెప్పారు. అందులో ప్రజాప్రయోజనం ఉన్నందున తాము అలైన్మెంట్ మార్చామన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన కొత్త గెజిట్ వెనుక ప్రైవేట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉందని, ఒక్క బిల్డర్ ప్రయోజనమే ప్రభుత్వ ప్రయోజనంగా మారిందని హరీష్‌రావు ఆరోపించారు. ఒక్క బిల్డర్‌ను సంతోషపెట్టేందుకు రెండు వేల అపార్టుమెంట్లలో ఉండే నాలుగు వేల కుటుంబాలు, ఐదు వేల మంది ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని ఆరోపించారు. దసరా ముందు వీళ్ల ఇండ్లకు రెడ్ మార్కులు వేశారని, ఏం జరుగుతుందో తెలియక నిద్ర లేని రాత్రులు గడుతుపుతున్నరని తెలిపారు.
బిల్డర్ వేధింపులు
ఈ ప్రాంతంలో ఆర్ఆర్ రియాల్టీ అనే బిల్డర్ తమను ఎలా వేధించాడో, ఆయన భూదాహానికి తాము ఎలా ఇబ్బంది పడ్డామో ఇక్కడ ఇల్లు ఉన్న అలెగ్జాండర్ రెడ్డి కాలనీ వాసులు కన్నీళ్లతో చెప్తున్నారన్నారు. ఈ రియల్టర్ ఎక్కడ ఉంటాడో తమ తమ్ముడు కార్తీక్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడన్నారు. అతను సాక్షాత్తూ ‘బిగ్ బ్రదర్’ ఆఫీసులోనే కూర్చుంటాడని, అక్కడ ప్రత్యేక ఛాంబర్ ఉందని, ఆ అండ చూసుకునే అతడికి ఇంత ధైర్యం వచ్చిందని చెప్పాడని తెలిపారన్నారు. జనవరి 7న ఒక జీవో వచ్చింది.. 8న మార్పులతో ఇంకో గెజిట్ వచ్చింది.. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, పెద్ద స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టే జీవోలు మారిపోయి ఇండ్లపై రెడ్ మార్కింగ్‌లు పడుతున్నాయని హరీష్‌రావు ఆరోపించారు. ఇక్కడి వెస్ట్రన్ మిడోస్ ప్రతినిధి డాక్టర్ నందగోపాల్ మాట్లాడుతూ ఇదంతా జరుగుతున్నది ‘బిగ్ బ్రదర్స’ కుటుంబానికి చెందిన (ముఖ్యమంత్రి కూతురు) కార్పొరేట్ స్కూల్ కోసం.. ఇంకోవైపు బిగ్ బ్రదర్స్ భాగస్వామి, అత్యంత సన్నిహితుడైన ఆరఆర్ రియాల్టీ హై-రైజ్ భవనాల కోసమేనని చెప్పారన్నారు. 2018లో వేసిన పాత నోటిఫైడ్ రోడ్డులో రాధా రియల్టర్స్ వెంచర్ ఎఫెక్ట్ అవుతుందని దాన్ని మార్పించాడని, కొత్తగా వేలంలో కొనుక్కున్న భూమికి, అతని ఇతర భూములకు హై-రైజ్ పర్మిషన్ రావాలంటే ముందు 100 ఫీట్ల రోడ్డు ఉండాలి కాబట్టి ఆ రోడ్డును గుండ్రంగా తిప్పి ఇక్కడున్న పది అపార్టుమెంట్లను కూల్చడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇదెక్కడి న్యాయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. ఇందులో జరిగిన భూ వేలం కుంభకోణం చూస్తే వీళ్ల దోపిడీ ఎంత బరితెగింపుగా ఉందో అర్థమవుతుందన్నారు. సాధారణంగా ప్రభుత్వం ఎప్పుడైనా భూమిని వేలం వేస్తే ముందు అక్కడ 100 ఫీట్ల రోడ్డు వేసి పేపర్లో నోటిఫికేషన్ ఇస్తుంది. అప్పుడు ఆ భూమికి ఎక్కువ ధర పలికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. కోకాపేట, నార్సింగి ప్రాంతంలో ఇవాళ గజం ధర రూ.2 లక్షలకు తక్కువ లేదు.. కానీ ఈ ప్రభుత్వ భూమికి 60 ఫీట్ల రోడ్డే ఉందని, హై-రైజ్ పర్మిషన్ రాదు అన్నట్లు చూపి వంద ఫీట్ల రోడ్డు విషయం దాచిపెట్టి సైలెంట్‌గా గజం కేవలం రూ.47 వేలకే వేలం వేసేశారని హరీష్‌రావు ఆరోపించారు. దాదాపు రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.26 కోట్లకే తమ బిల్డర్‌కు కట్టబెట్టారని, అతడు అగ్గువకు కొన్నాక ఆ భూమికి 100 ఫీట్ల రోడ్డు వేసేందుకు మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తామంటున్నారని ఆయన ఆరోపించారు. ఒకవైపు హైడ్రాని పెట్టి పేదవాళ్ల గుడిసెలన్నీ కూల్చి వాళ్లను రోడ్డు మీదకు తెచ్చారని, ఇంకోవైపు హైదరాబాద్ చుట్టూ భూములను ‘22-ఎ’ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. ఇప్పుడు 100 ఫీట్ల రోడ్ల పేర మధ్యతరగతి ప్రజల అపార్టుమెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గెజిట్ మార్చాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి
చట్టప్రకారం కొత్త గెజిట్ ఇవ్వాలన్నా, మాస్టర్ ప్లాన్ మార్చాలన్నా ముందు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడాలి, పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. కానీ ఇక్కడ ఏ ఒక్కటీ చేయలేదని హరీష్‌రావు తెలిపారు. బాధితులు తమ గోడు చెప్పుకుందామంటే అధికారులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. వినతిపత్రం ఇస్తామంటే ఇందులో చాలా పెద్దవాళ్లు ఉన్నారు.. తాము మాట్లాడలేం, కాగితం కూడా తీసుకోలేం అని అంటున్నారంటే రాష్ట్రంలో అసలు చట్టం ఉందా అని ప్రశ్నించారు. దీని వెనుక ముఖ్యమంత్రి కుటుంబం, ‘బిగ్ బ్రదర్స’ ఉన్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నిలదీశారు. రక్షకుడే ఇవాళ భక్షకుడిగా మారాడని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఇంట్లో నలుగురు అన్నదమ్ములు కలిసి ఉండటమే కష్టమైన ఈ రోజుల్లో ఏ బిల్డర్ లేకుండా 1,553మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక తాటిపైకి వచ్చి ఒకే కుటుంబంలా కలిసి సెవన్ హిల్స్ అపార్టుమెంటు నిర్మించుకుని 13-17 ఏళ్లుగా జీవిస్తున్నారని చెప్పారు. అలాంటి అపార్టుమెంటుకు ఒకవైపు 10 మీటర్లు, ఇంకోవైపు 7 మీటర్లు లోపలికి రెడ్ మార్కులు వేశారన్నారు. దీనివల్ల సెల్లార్లోకి వెళ్లే మార్గం, గుడి, వాకింగ్ ట్రాక్ పోతాయన్నారు. సెల్లార్ పార్కింగ్ పోతే పిల్లర్లు దెబ్బతిని అసలు భవనం బలం, అపార్ట్మెంటు లైఫే పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్, అలెగ్జాండర్ రెడ్డి లాంటి వ్యక్తిగత ఇండ్లు, పాఠశాలలు.. ఇలా దాదాపు పది అపార్టుమెంట్లు దెబ్బతింటున్నాయని చెప్పారు. పక్కనే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉండే పేదలు కూడా ఇక్కడికి వచ్చి తమ బాధ చెప్పుకున్నారన్నారు. గతంలో వాళ్లు కేవలం వంద మీటర్లలో మెయిన్ రోడ్డు మీదకు వచ్చేలా దారి ఉండేదని, ఈ బిల్డర్ రాత్రికి రాత్రే రేకులు పెట్టి దారి మూసేసి డ్రైనేజీ మార్చేసి రోడ్డును తవ్వేశాడని, దీంతో వారు కిలోమీటరు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని, ఇదేంటని అడిగితే పోలీసులను పెట్టి భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
నాడు కేసీఆర్ పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి గృహ పవేశాలు చేయించారని, ఇండ్లలోకి వెళ్లే దారిని కూడా మూసేస్తారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసులు ఎవరూ అధైర్యపడొద్దు.. తామంతా మళ్లీ మీ కాలనీకి వస్తాం.. మీ దారిని తెరిపిస్తాం అని స్పష్టం చేశారు. నాడు కోకాపేట, నార్సింగి ప్రాంతంలో మంచినీళ్ల సమస్య ఉంటే కేసీఆర్ ప్రభుత్వం పైప్లైన్లు వేసి పుష్కలంగా నీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. 24 గంటల కరెంటు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ట్యాంకర్ల దందా మొదలైందని, ఇంకో నాలుగు రోజులు పోతే మళ్లీ కోతలు, ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గత దీపావళి సమయంలో హైదర్షాకోట్లో మూసీ సుందరీకరణ పేరుతో 40-50 ఏళ్ల నుంచి ఉంటున్న పేదల ఇండ్లకు ఇలాగే రెడ్ మార్కులు ఇచ్చి రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చాడన్నారు. వాళ్లంతా తెలంగాణ భవన్‌కు వస్తే తాము వెళ్లి బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించామని, బీఆర్ఎస్ పోరాటంతో రేవంత్ రెడ్డి దిగొచ్చి ఇండ్లు, అపార్టుమెంట్లు కూల్చబోమని ప్లాన్ మార్చుకున్నాడని తెలిపారు. నార్సింగిలో కూడా ఈ రెడ్ మార్కులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే దాకా బీఆరఎస్ పార్టీ మీ వెన్నంటి ఉంటుందన్నారు. కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు, రిటైర్డ్ జడ్జితో కూర్చుని చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ రూపొందిస్తామని, అవసరమైతే తాను, సబిత, దాసోజు శ్రావణ్, సుధీర్ రెడ్డి, తమ నగర ఎమ్మెల్యేలమంతా మీతోపాటు హెచఎండీఏ కార్యాలయానికి వచ్చి అధికారులను నిలదీస్తామని హామీ ఇచ్చారు. న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో ఎక్కడైనా సరే ఈ గెజిట్ రద్దయ్యేదాకా పోరాడుతామన్నారు. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి.. పది నిమిషాల్లో మీ ముందుంటాం, తమ కార్తీక్ రెడ్డి 24 గంటలూ మీకు అందుబాటులో ఉంటాడని హరీష్‌రావు హామీ ఇచ్చారు. సమస్య పెద్దది కాకముందే ప్రభుత్వం తక్షణమే ఈ 2026 గెజిట్‌ను నిలిపివేయాలని, 2018లో ఇచ్చిన పాత గెజిట్ ప్రకారమే రోడ్డు వేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




