భారత్‌లో తగ్గిన ఆర్థిక అసమానతలు

– ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పేదరిక నిర్మూలన, సంక్షేమం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా చేపట్టిన కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన పావర్టీ అండ్ ఈక్విటీ-2026 (పేదరికం, సమానత్వం) నివేదికలో భారత్ సాధిస్తున్న ప్రగతిని గురించి ప్రత్యేకంగా కొనియాడటం సంతోషకరమన్నారు. 2011-12లో 27.1 శాతం ఉన్న ‘అత్యంత పేదరికం’ 2023-24 నాటికి 2.6 శాతానికి తగ్గింది,, అదే సమయంలో 49.6 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు.. 2017 నుంచి 2023 మధ్యలో భారత్‌లో ఉపాధి అవకాశాలు 13.4 కోట్ల మేర పెరిగాయి.. ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఉపాధి రంగంలోకి పెద్ద సంఖ్యలో అడుగు పెట్టారని, తద్వారా వెనుకబడిన కుటుంబాల ఆదాయం భారీగా పెరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయి. 2014లో 55.9% ఉన్న ఎల్‌పీజీ కవరేజీ 2026 నాటికి 100% చేరింది. 2014లో గ్రామీణ ప్రాంతాల్లో 38.7% మాత్రమే పారిశుధ్యం ఉండేది. 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 100% పారిశుధ్యం చేరింది. 2024 నాటికి దేశంలోని 99.9 శాతం మందికి విద్యుత్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 2019లో గ్రామీణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు 16.7 శాతం ఉండగా, 2026 నాటికి 82 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు కల్పించారు. జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా 80 కోట్ల మందికి మోదీ సర్కారు ఉచితంగా బియ్యం, ఆహార ధాన్యాలను అందిస్తోంది. ప్రజల్లో ఆదాయ అసమానతలను తగ్గించడంలో కూడా భారత్ పురోగతి సాధించింది. గినీ సూచీలో భారత్ స్కోరు 23గా నమోదైంది. అమెరికా (41.8), చైనా (36), జర్మనీ (33.7), యూకే (32.4), ఫ్రాన్స్ (31.8), బ్రెజిల్ (50.3), దక్షిణాఫ్రికా (54.1) వంటి దేశాల కన్నా చాలా తక్కువ. గినీ ఇండెక్స్ ఎంత తక్కువగా ఉంటే ఆదాయ సమానత్వం అంత ఎక్కువగా ఉన్నట్లు అర్థం. అలాగే, దేశంలో కేన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాల కారణంగా దాదాపు 487 బ్రాండ్ల కేన్సర్ మందుల ధరలు భారీగా తగ్గాయి. 276 బ్రాండ్ల ధరలు 50% కన్నా ఎక్కువ తగ్గాయి. కొన్ని మందుల ధర ఏకంగా 94 % వరకు తగ్గింది. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, ఆహార భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల నమ్మకమే తమ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తోంది. 140 కోట్ల మంది ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ.వికసిత్ భారత్ నిర్మాణం దిశగా దృఢ సంకల్పంతో ఇదే విధంగా ముందుకు సాగుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *